Vini Tandon Keni: చీర... నా రెండో గుర్తింపు | Sakshi
Sakshi News home page

Vini Tandon Keni: చీర... నా రెండో గుర్తింపు

Published Sat, Apr 13 2024 4:41 AM

Saree Speak: Vini Tandon Keni starts of Studio Saree Speak for Womens - Sakshi

అప్పటివరకు గృహిణిగానే కాలం వెళ్లబుచ్చింది వినీ టాండన్‌ కెనీ. 53 ఏళ్ల వయసులో చీరకట్టు ద్వారా బిజినెస్‌ ఉమెన్‌గా మారింది. నేటి తరం అమ్మాయిలకు చీరకట్టు నేర్పించడానికి
గోవాలో ప్రత్యేకంగా ‘శారీ స్పీక్‌’ స్టూడియోను ఏర్పాటు ద్వారా చేనేతకారులను ప్రోత్సహిస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ‘శారీ గ్రూప్‌’ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలను ప్రభావితం చేస్తోంది. ‘చీర నా రెండో గుర్తింపు’ అంటున్న వినీ గురించి ... వినీ టాండన్‌ కెనీ ని పలకరిస్తే చాలు చీరల పట్ల తనకున్న ప్రేమను ఎంతో ఆనందంగా వ్యక్తపరుస్తుంది. ‘శారీ స్పీక్‌’ స్టూడియో వ్యవస్థాపకురాలుగా ఆమె ప్రయాణం నేటితరానికి కొత్త పాఠం.


భార్య.. తల్లి... కోడలు.. శారీ ఇన్‌ఫ్లుయెన్సర్, కామిక్‌ కంటెంట్‌ సృష్టికర్త కూడా... ఇన్ని పాత్రలను చిరునవ్వుతో పోషించవచ్చుననడానికి వినీనే ఉదాహరణ. ‘నా కుటుంబమే నాకు బలం. ఉత్సాహం. మా కుటుంబ సభ్యులే నా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ‘శారీ స్పీక్‌’ని క్రియేట్‌ చేసి రేపటికి ఏడేళ్లు పూర్తవుతాయి. ఈ గ్రూప్‌ కారణంగా చాలామంది మహిళల ఆలోచనల్లో చీర గురించిన నిర్వచనమే మారిపోయింది.

ఖాళీ నుంచి మొదలైన ప్రయాణం... నేను పుట్టి పెరిగింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో. మా నాన్నగారు మెరైన్‌ ఇంజనీర్‌ అవడంతో ఆయన ఉద్యోగరీత్యా వివిధ నగరాల్లో నివసించాం. నాన్నగారికి గోవాలో పోస్టింగ్‌ వచ్చినప్పుడు అక్కడ ప్రసాద్‌ కెనీతో నా పెళ్లి జరిగింది. అలా నేను గోవాలోనే ఉండిపోయాను. ఇద్దరు అబ్బాయిల పెంపకంలో ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లై కాలేజీలకు వెళుతున్నప్పుడు నాలో ఏదో వెలితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా ఆసక్తుల వైపు దృష్టి సారించాను. మొదట సినిమా అభిమానుల కోసం ‘మూవీ స్పీక్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశాను. ఆ తర్వాత వివిధ రకాల కళలు, కవులు .. మొదలైన గ్రూప్‌లను సృష్టించాను. అదే సమయంలో ‘శారీ స్పీక్‌’ బృందం కూడా ఏర్పాటయింది.  

అలా మొదలైంది... మా అమ్మ, అత్తగారు సౌకర్యం కోసం చీర నుంచి సల్వార్‌ కమీజ్‌కు మారినప్పుడు నాకెందుకో మనసు చివుక్కుమంది. ఈ విధంగా ఆలోచిస్తే అందరూ చీర కట్టుకోవడం మానేస్తారని అనిపించేది. దీంతో నేను చీర కట్టుకోవడం మొదలుపెట్టాను. నన్ను చీరలో చూసి, నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు కూడా చీరలవైపు మొగ్గు చూపేవారు. చీరకట్టు ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసేదాన్ని. నాకు మంచి స్పందన రావడంతో వాళ్లూ పోస్ట్‌ చేయడం మొదలుపెట్టారు.

చేనేత కారులే నా బ్రాండ్‌... మా చిన్నబ్బాయి సొంతంగా ఏదైనా బిజినెస్‌ స్టార్ట్‌ చేయమన్నప్పుడు శారీ ఐడియా గురించి చెప్పాను. స్టూడియో ఏర్పాటుకు తనే మద్దతుగా నిలిచాడు. దీంతో 53 ఏళ్ల వయసులో శారీ స్టూడియోతో వ్యాపారవేత్తను అయ్యాను. నా సొంత బ్రాండ్‌ అంటూ ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల నుంచి చేనేత చీరలను కొనుగోలు చేసి, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాను. నా స్టూడియోలో 95 శాతం చేనేత చీరలే ఉంటాయి. ఇప్పుడు చీరలను ఇష్టపడే మహిళలు వాటిని కొనడానికి నా స్టూడియోకు రావడం మొదలుపెట్టారు. కొందరు చీర కట్టుకోవడం తమకు చేతకాదని, ఇంకొందరూ తమకు అసౌకర్యం అని చెబుతుంటారు. చీరకట్టుకోవడానికి ఐదు నిమిషాలు చాలు. ఇక అసౌకర్యం ఎందుకో నాకు అర్థం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నా స్టూడియోలో చీరకట్టుకు సులువైన టెక్నిక్స్‌ ఇస్తుంటాను.

శారీ స్పీక్‌ స్టోరీలు... చీరకట్టు గురించి మాత్రమే కాదు వారి ఆనందం, అలాగే తమ మానసిక వేదనల నుంచి బయటపడే విధానాల గురించి చెప్పినప్పుడు వాటినీ సోషల్‌ మీడియా వేదికగా పంచుతుంటాను. బెంగళూరుకు చెందిన ఉషా అగర్వాల్‌ అనే మహిళ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. కొన్ని రోజులకు నా పోస్ట్‌లను చూసి తనూ ప్రతి రోజూ కొత్త చీర కట్టుకొని, వాటిని పోస్ట్‌ చేసింది. ఆ మార్పుతో తన బాధ నుంచి కొద్ది రోజుల్లోనే బయటపడగలిగింది. ఆమె శారీ స్పీక్‌కి కృతజ్ఞతలు తెలిపింది.

వెయ్యిమందిలో... ప్యాంటు నుండి సల్వార్‌ డ్రెస్సుల వరకు అన్నీ ధరిస్తాను. కానీ, నాకు అపారమైన నమ్మకాన్ని ఇచ్చేది శారీనే. చీర కట్టుకోగానే నా ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. నాతో చీర మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కిందటేడాది భారతీయ నేత కార్మికులకు సహాయం చేయడానికి యూకే రాయల్‌ ఆస్కాట్‌ హార్స్‌ రేస్‌లో సుమారు వెయ్యిమంది వరకు చీరలు ధరించారు. వారిలో నేనూ ఉన్నాను. మేం తమ దేశంలో చీర ధరించాలని నిర్ణయించుకున్నందుకు బ్రిటిషర్లు మా వేషధారణను చూసి ఎంతో ఆనందించామని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది.

లక్షా డెబ్భై వేల మంది సభ్యులు... శారీ స్పీక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి ప్రపంచం నలుమూలల నుండి లక్షా డెబ్భై వేల మంది సభ్యులు గా ఉన్నారు. ఈ గ్రూపులో మహిళలు మాత్రమే సభ్యులు. ఈ గ్రూప్‌ చీరలను మాత్రమే ప్రమోట్‌ చేస్తుంది.

ఇన్నేళ్లుగా చీర నన్ను బిజీగా ఉంచింది. నిన్ను చూడగానే చీరలు కట్టుకోవడం మొదలు పెట్టామంటూ చాలా మంది మహిళలు నాకు మెసేజ్‌ చేస్తుంటారు. మీ వల్లే మాకు ప్రమోషన్‌ వచ్చిందని, మా అమ్మకాలు పెరిగాయని చేనేత కార్మికులు అంటున్నారు. ఇదంతా వింటే మరింత పనిచేయాలనే ధైర్యం వస్తుంది. ఈ నెల 14న మా గ్రూప్‌ ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరూ చీరలో ఆనందంగా విహరించండి’ అంటున్నారు వినీ టాండన్‌.

Advertisement
Advertisement