కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది! | Sakshi
Sakshi News home page

కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!

Published Sat, Apr 20 2024 3:39 AM

Super Six schemes are released for trail - Sakshi

తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్‌ రాబిన్‌ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్‌ బూత్‌’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్‌ ప్రొవైడర్‌’ వ్యక్తం చేసిన నిస్సహాయత.

ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్‌’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’  పేరుతో ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు ‘ట్రయిల్‌’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు.

ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్‌ మేనేజ్మెంట్‌’ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్‌సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్‌ కిషోర్‌– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్‌ శర్మ బృందానికి సూచించారు.

ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్‌’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్‌ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు.

ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్‌’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్‌ నోటీస్‌’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్‌’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’.

అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్‌ బెనిఫిట్‌’; ఓడిపోతే, ‘సింగిల్‌ బెనిఫిట్‌’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్‌’.అందుకే గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్‌ సిక్స్‌’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు.

అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని  వెల్లడించారు. 

జగన్‌ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్‌’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు.

రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్‌ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది.

- వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్‌: 98481 28844
- అడుసుమిల్లి జయప్రకాష్‌
 

Advertisement
Advertisement