దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్‌ ఖలీఫాలో ఏం జరుగుతుంది? | Do You Know How Is Diwali Celebrated In Dubai And What Happens At Burj Khalifa? - Sakshi
Sakshi News home page

Diwali Celebrations In Dubai: దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్‌ ఖలీఫాలో ఏం జరుగుతుంది?

Published Thu, Nov 9 2023 8:56 AM

Diwali in Dubai how Celebration is Done - Sakshi

దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు.  ప్రపంచవ్యాప్తంగా  ఉ‍న్న హిందువులంతా జరుపుకునే  పండుగ ఇది. దీపావళి పండుగ ఆనందం, ఐక్యతలకు చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్‌లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

దీపావళి ఉత్సవ సమయాన ప్రజలు నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ముగ్గులతో గృహాలను, బహిరంగ ప్రదేశాలను అలంకరిస్తారు. ఈ సంప్రదాయం దుబాయ్‌లో కూడా కనిపిస్తుంది. దుబాయ్‌వాసులు దీపావళి రోజున తమ ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు. వ్యాపార సంస్థలను విద్యుత్‌ లాంతర్లతో అలంకరిస్తారు. ఈ దీపాల వెలుగులు దుబాయ్‌ అంతటా కనిపిస్తాయి. 

దుబాయ్‌లో దీపావళి షాపింగ్ ఉత్సాహం కొన్ని వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. దుబాయ్‌లోని మార్కెట్లు, మాల్స్  కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తాయి. భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలు, కుర్తా-పైజామాలు మార్కెట్‌లలో విరివిగా కనిపిస్తాయి. దీపావళి వేడుకలలో అంతర్భాగమైన తీపి వంటకాలను, రుచికరమైన స్నాక్స్‌ను విరివిగా విక్రయిస్తుంటారు. 

దీపావళి నాడు దుబాయ్‌లో బాణాసంచా వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. దీపావళి సందర్భంగా దుబాయ్‌లోని పలు రెస్టారెంట్లు ప్రత్యేక దీపావళి వంటకాల మెనూలను అందిస్తాయి. అక్కడి భారతీయులు, పర్యాటకులు ఈ సాంప్రదాయ వంటకాల రుచులను ఆనందంగా ఆస్వాదిస్తారు. 
ఇది కూడా చదవండి: చైనా దురహంకారంపై అమెరికా, భారత్‌ ఉక్కుపాదం!

Advertisement
Advertisement