మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి

Published Fri, Apr 19 2024 1:45 AM

విలేకరుల సమావేశంలో 
మాట్లాడుతున్న కలెక్టర్‌ భవేష్‌మిశ్రా  - Sakshi

భూపాలపల్లి: లోక్‌సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌మిశ్రా అన్నారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై సమీకృత కలెక్టర్‌ కార్యాలయపు సమావేశపు హాల్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవేష్‌మిశ్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడిందన్నారు. షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా ఉల్లంఘన జరిగితే నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే సీ–విజిల్‌ యాప్‌ ద్వారా లైవ్‌ వీడియోలతో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా ఫిర్యాదులు 24 గంటల పాటు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్‌ విండో సిస్టం ద్వారా అనుమతులు జారీ చేస్తామన్నారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని తెలిపారు. సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు, ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని తెలిపారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించవద్దని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణకు నియమించిన టీంలు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని తెలిపారు. చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ట నిఘా ఉండాలని, వాహనాలు తనిఖీ చేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి మే 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే మూడు ఎఫ్‌ఎస్‌టీ టీంలను ఏర్పాటుచేసి మద్యం, నగదు, ఇతరత్రా వస్తువులు, రాజకీయ పార్టీల సమావేశాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ సీజ్‌ చేసిన డబ్బును ఇతరత్రా వస్తువులను గ్రీవెన్స్‌ కమిటీ టీం ద్వారా ఆధారాలను పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఓటింగ్‌ జరగడమే లక్ష్యమని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా అన్నారు.

1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా

ఫిర్యాదు చేయొచ్చు

ఫ్రీ అండ్‌ ఫేర్‌ ఓటింగ్‌ లక్ష్యం

కలెక్టర్‌ భవేష్‌మిశ్రా

Advertisement
Advertisement