భారతీయ జర్నలిస్టుల ఫోన్లపై పెగాసస్‌ నిఘా! | Sakshi
Sakshi News home page

భారతీయ జర్నలిస్టుల ఫోన్లపై పెగాసస్‌ నిఘా!

Published Fri, Dec 29 2023 4:29 AM

Indian journalists targeted by Israeli spyware again - Sakshi

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్రప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ ‘యాపిల్‌’ నుంచి అప్రమత్తత సందేశాలు అక్టోబర్‌లో వచి్చన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తమ ఫోన్లను ల్యాబ్‌ పరీక్షకు పంపించగా అవి పెగాసస్‌ స్పైవేర్‌ హ్యాకింగ్‌కు గురయ్యాయని  తేలింది.

తమ సెక్యూరిటీ ల్యాబ్‌ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గురువారం ప్రకటించింది. దీంతో ఆనాడు చాలా మందికి పొరపాటున అలర్ట్‌లు వచ్చాయన్న యాపిల్‌ ఇచి్చన వివరణ తప్పు అని తేలింది.∙పెగాసస్‌ తమ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తోంది. భారత్‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొంత హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలుచేసినట్లు వాణిజ్య గణాంకాల్లో వెల్లడైంది.

ఈ స్పైవేర్‌ సాయంతో దేశంలోని ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్‌ చేశారని 2021 జూలైæ నెలలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం తెల్సిందే. భారత్‌లోనూ ప్రముఖులు ఈ హ్యాకింగ్‌బారిన పడ్డారని ‘ది వైర్‌’ వార్తాసంస్థ సంచలన కథనం వెలువరిచింది. ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌ ఎడిటర్‌ సిద్ధార్థ్‌ వరదరాజన్, ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్ట్‌ ప్రాజెక్ట్‌(ఓసీసీఆర్‌పీ) సౌత్‌ ఆసియా ఎడిటర్‌ ఆనంద్‌ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది.

వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వమే యాపిల్‌ సంస్థపై ఒత్తిడి తెచ్చి తప్పుడు అలర్ట్‌లు వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పేర్కొంది. ‘ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ఐఫోన్‌ యూజర్లకు ఇలా పొరపాటున అలర్ట్‌లు వెళ్లాయి’’ అని యాపిల్‌ ఆనాడు ప్రకటించింది. రాహుల్‌ గాం«దీసహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్‌ ఉదంతం గతంలో పార్లమెంట్‌నూ కుదిపేసింది. ఇంత జరిగినా ‘‘తాము స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌ సంస్థ నుంచి కొనలేదు. వినియోగించలేదు’’ అని మోదీ సర్కార్‌ చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్‌ ఇంటెలిజెంట్‌ డైరెక్టరేట్‌ గతంలో కాగ్సైట్‌ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement