సుదీర్ఘ కాలం తర్వాత రష్యా, ఉక్రెయిన్‌లు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది పలు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. యుద్ధం మధ్య రష్యా, ఉక్రెయిన్‌లు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పలు దేశాలు పేర్కొంటున్నాయి.
ఉక్రెయిన్- రష్యాలు తాజాగా యుద్ధ ఖైదీలుగా ఉన్న ఇరు దేశాలకు చెందిన చెరో 75 మంది సైనికులను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. ఈ విషయాన్ని అధికారులు మీడియాకు తెలియజేశారు. గత మూడు నెలల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి జరగడం ఇదే తొలిసారి.
నలుగురు ఉక్రేనియన్ పౌరులతో సహా ఈ యుద్ధ ఖైదీలను ఉత్తర సుమీ ప్రాంతానికి పలు బస్సులలో తరలించారు. బస్సు దిగిన వెంటనే వారు ఆనందంతో కేకలు వేయడంతో పాటు, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాము స్వదేశానికి తిరిగి వచ్చిన విషయాన్ని తెలియజేశారు. వీరిలోకి కొందరు మోకాళ్లపై వంగి నేలను ముద్దాడటం కనిపించింది. మరికొందరు పసుపు, నీలి రంగు జెండాలను పట్టుకుని ఒకరినొకరు కౌగిలించుకుని రోదించారు.
ఈ విధమైన యుద్ధ ఖైదీల మార్పిడికి ముందు, ఇరుపక్షాలు సైనికుల మృతదేహాలను పరస్పరం అప్పగించుకున్నాయని, ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇలా జరగడం ఇది 52వ సారని అధికారులు తెలిపారు. ఉక్రేనియన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ మొత్తం 3,210 మంది ఉక్రేనియన్ సైనిక సిబ్బంది, పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment