Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ మృతి 

Published Fri, Mar 29 2024 3:25 AM

Jailed gangster Mukhtar Ansari passes away - Sakshi

లక్నో: జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్‌ రాజకీయ నాయకుడు ముఖ్తార్‌ అన్సారీ(63) గురువారం గుండెపోటుకు గురై బందా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో మృతి చెందారు. అంతకుముందు, రాత్రి 8.25 గంటల సమయంలో అన్సారీ ఆరోగ్యం విషమించడంతో అధికారులు బందా జిల్లా జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల బృందం చికిత్సలు చేస్తుండగానే ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు బందా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సునీల్‌ కౌశల్‌ పీటీఐకి తెలిపారు.

దీంతో, ఉన్నతాధికారులు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్‌ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పొట్టలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంగళవారం కూడా ఆస్పత్రిలో 14 గంటలపాటు ఉంచినట్లు అధికారులు చెప్పారు. జైలులో ఆయనపై విష ప్రయోగం జరిగిందని ఇతడి సోద రుడు, ఘాజీపూర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. 

5సార్లు ఎమ్మెల్యే.. 60కిపైగా కేసులు 
మౌ సదర్‌ స్థానం నుంచి రెండుసార్లు బీఎస్‌పీ తరఫున, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి సొంతపార్టీ క్వామీ ఏక్‌తా దళ్‌ తరఫున మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ ఆరోపణలపై యూపీ, పంజాబ్‌ జైళ్లలో 2005 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈయనపై 60కి పైగా క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యూపీలోని వివిధ కోర్టులో 2022 నుంచి ఇతడిపై ఉన్న 8 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం బందా జైలులో ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement