జేఎన్‌యూ నుంచి రాజకీయాల్లోకి.. ఈ ముగ్గురూ ఎంపీలు కాగలరా? | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections-2024: జేఎన్‌యూ నుంచి రాజకీయాల్లోకి.. ఈ ముగ్గురూ ఎంపీలు కాగలరా?

Published Thu, Apr 18 2024 11:17 AM

Kanhaiya Kumar Sandeep Saurav Dipsita Dhar Learned Art of Politics from Jnu - Sakshi

దేశ రాజకీయాల్లో ప్రమేయం కలిగిన విశ్వవిద్యాలయాల జాబితాలో జేఎన్‌యూ అగ్రస్థానంలో ఉంది. గత 50 ఏళ్లలో జెఎన్‌యూ పలువురు విద్యార్థి నేతలకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించింది. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా లోక్‌సభకు చేరుకోలేకపోయారు.

ఇప్పుడు తొలిసారిగా ముగ్గురు జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్నయ్య కుమార్, నలంద నుంచి సందీప్ సౌరభ్, సెరంపూర్ నుంచి దీప్సితా ధర్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఇండియా అలయెన్స్‌ అభ్యర్థులే కావడం విశేషం.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ హస్తం గుర్తుపై ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కన్నయ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసరాయ్‌ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

కన్హయ్య ప్రస్తుతం కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ నివాసి కన్హయ్యపై 2016లో దేశద్రోహం ఆరోపణలు రావడంతో అతను హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్‌పై కన్నయ్య ఉన్నారు. 

2015-16లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేసిన కన్హయ్య కుమార్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై పోటీ చేస్తున్నారు. తివారీ 2014 నుంచి ఈ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. కన్హయ్యకు ఇక్కడ విజయం అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌కు కేవలం 28 శాతం ఓట్లు రాగా, బీజేపీకి చెందిన మనోజ్ తివారీకి దాదాపు 54 శాతం ఓట్లు వచ్చాయి. 

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి సందీప్ సౌరభ్ బీహార్‌లోని నలంద సీటు నుంచి ఇండియా అలయన్స్ అభ్యర్థిగా  బరిలోకి దిగారు. బీహార్‌లో నలంద జేడీయూకి కంచు కోట అని చెబుతారు. 

ప్రస్తుతం ఇక్కడి నుంచి జేడీయూకు చెందిన కౌశలేంద్ర కుమార్ ఎంపీగా ఉన్నారు. పార్టీ ఈసారి కూడా ఆయననే బరిలోకి దింపింది. సందీప్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతకుముందు సందీప్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పాలిగంజ్ స్థానం నుండి పోటీ చేసి, విజయం సాధించారు. 

జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేసిన సందీప్‌ 2013లో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే నలంద సీటు నుంచి గెలవడం సందీప్‌కు అంత సులువు కాదు. 1996 నుంచి ఈ సీటు సమతా పార్టీ-జేడీయూలో గుప్పిట్లో ఉంది. 2019లో జేడీయూ ఈ స్థానాన్ని రెండు లక్షల 56 వేల ఓట్లతో గెలుచుకుంది.

జేఎన్‌యూ ఎస్‌ఎఫ్‌ఐ మాజీ అధ్యక్షురాలు దీప్సితా ధర్ పశ్చిమ బెంగాల్‌లోని సెరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటు తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది.  కళ్యాణ్ బెనర్జీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీప్సీత పోటీ చేశారు. సీపీఎం ఆమెను బాలి స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఆమె అక్కడ మూడో స్థానంలో నిలిచారు... ఇలా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన ఈ ముగ్గురు పూర్వ విద్యార్థి నేతలు ఎంపీ స్థాయికి చేరుకుంటారో లేదో వేచిచూడాల్సిందే. 

Advertisement
Advertisement