‘ఆల్‌ ఫ్రీ బాబు’ పునరాగమనం | Sakshi
Sakshi News home page

‘ఆల్‌ ఫ్రీ బాబు’ పునరాగమనం

Published Wed, May 1 2024 12:29 AM

Sakshi Guest Column On Chandrababu Politics

విశ్లేషణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన చంద్రబాబు  2009లోనైనా గెలవాలని లెక్కకు మిక్కిలి హామీలనిచ్చారు. అయినా ఓడారు. 2014లో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ల పొత్తుతోపాటు, ఎడాపెడా హామీలనిచ్చి గెలిచారు కానీ వాటిని అమలు చేయటంలో విఫలమయ్యారు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడారు. అందుకే ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! ఈసారి మళ్లీ ఎలాగైనా గెలవాలని బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా హామీలను గుప్పిస్తు న్నారు. అలా కాదంటే, దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంతవుతుందో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి.

చరిత్ర మొదటిసారి విషాదంగా, రెండవసారి ప్రహసనంగా పునరావృతమవుతుందంటాడు కార్ల్‌ మార్క్స్‌. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల హామీలను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన ఆయన 2009లోనైనా గెలవాలని లెక్కకు అందనన్ని హామీలనిచ్చారు. అయినా ఓడారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ఓడిన ఆయన 2024లోనైనా గెలిచి తీరాలనుకుంటూ తిరిగి ఉచితాల హామీలను కుప్పలుతెప్పలుగా ఇస్తున్నారు. ఆయనలోని ఈ లక్షణాన్ని గమనించినందుకే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆయనకు ‘ఆల్‌ ఫ్రీ బాబు’ అని పేరు పెట్టారు.

2009 ఎన్నికల ప్రచారం నాటి ఒక జ్ఞాపకం ప్రస్తుత సందర్భంలో మళ్ళీమళ్ళీ గుర్తుకు వస్తున్నది. అప్పుడు చంద్రబాబు ప్రతి సభలో తన ఉచిత హామీలను ఒక దానిని మించి మరొకటి ప్రకటిస్తుండే వారు. దానిపై రాజశేఖరరెడ్డి కూడా ప్రతి సభలో, ‘‘చంద్రబాబు ఆల్‌ ఫ్రీ బాబు అయిపోయారు. అన్నీ ఫ్రీగా ఇస్తారట. నమ్ముతారా?’’ అని ప్రజలను నేరుగా అడిగేవారు. అందుకు జవాబుగా ప్రజల నుంచి ‘‘నమ్మం, నమ్మం’’ అనే కేకలు పెద్ద ఎత్తున వినిపించేవి. 

చివరకు చంద్రబాబు అన్నన్ని హామీలిచ్చి కూడా రెండవసారి ఓడిపోయారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషం మరొకటి ఉంది. తనవైపు నుంచి తాను కూడా 2004లో కొన్ని హామీలిచ్చిన రాజశేఖరరెడ్డి, 2009లో కొత్తగా దాదాపు ఏమీ ఇవ్వలేదు. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, మరికొన్ని హామీలను బడ్జెట్‌ భరించలేదని చెప్పటం అందుకు కారణ మని అప్పుడు విన్నాము. 

దానితో రాజశేఖర రెడ్డికి చంద్రబాబు హామీలు అలవికానివనీ, కేవలం ఎన్నికలలో గెలిచేందుకు ఉచితాల వర్షం కురిపిస్తున్నారనీ అర్థమైంది. అప్పుడు, తన ప్రచారానికి కొత్త హామీలను కాకుండా 2004–2009 మధ్య కాలపు తన సమర్థవంతమైన పాలనను, దానిపట్ల ప్రజలకు కలిగిన విశ్వాసాన్ని ఆధారం చేసుకోదలిచారు. ఈ ఆలోచన, అందుకు అనుగుణమైన ప్రచారం పనిచేశాయి. ఫలితం తెలిసిందే.

రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిందేమిటో చూడండి. 2014లో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ల పొత్తుతో గెలిచిన చంద్రబాబు, అటువంటి పొత్తు ఉండి కూడా, ఏ పొత్తూ లేని జగన్‌మోహన్‌ రెడ్డిని ఓడించేందుకు ఎడాపెడా హామీలు ఇవ్వవలసి వచ్చింది. కానీ వాటిని అమలు చేయటంలో విఫలమై, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడి పోయారు. తన పాలన ప్రజలను మెప్పించి ఉంటే, ఈ రెండవసారి పొత్తులు ఉన్నా లేకున్నా గెలవాల్సింది. 

కానీ అది జరగకపోగా, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. మరొక విధంగా చెప్పాలంటే, అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! తెలుగునాట ఎన్నికల చరిత్రలో ఇటువంటి అప్రతిష్ఠ సంపాదించిన నాయకుడు మరెవ్వరూ లేరు. తన 2004 నాటి ఎన్నికల ఓటమిని గమనిస్తే ఈ మాట మరింత బాగా అర్థమ వుతుంది. 

ఎన్నికలకు కొద్దిముందు తిరుపతి వద్ద ఆయనపైన నక్స లైట్‌ దాడి జరిగింది. ఆ స్థాయి గల ఒక నాయకునిపై అంత తీవ్రమైన దాడి జరగటం అదే మొదలు, అదే ఆఖరు. అటువంటపుడు తన పట్ల చాలా సానుభూతి రావలసింది! అయినప్పటికీ అందువల్లగానీ, తన పాలనా ప్రతిష్ఠవల్ల గానీ గెలవగలననే నమ్మకం ఏర్పడని చంద్రబాబు, ముఖ్యంగా రైతుల కోసం, గ్రామీణుల కోసం డజన్ల కొద్దీ వరాలు ప్రకటించారు. అయినా గెలవలేదు.

ఎన్టీఆర్‌ ఉదంతాన్ని అట్లుంచినా, చంద్రబాబుకు సామాన్య ప్రజల సంక్షేమం కోరే నాయకునిగా ఎన్నడూ పేరు లేదు. అధికారానికి వచ్చిన కొత్తనుంచే అప్పటి ఆర్థిక సంస్కరణలను ఎంతో ఉత్సాహంగా భుజాన వేసుకున్న ఆయన తనను తాను సీఈఓగా చెప్పుకొన్నారు. సంస్కరణలకు దేశంలో అందరికీ మించిన పతాకధారి అయ్యారు. ఆ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ను సైతం మించిపోయి దేశ విదేశాల లోనూ పేరు సంపాదించి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రీతి పాత్రు డయ్యారు. 

కానీ ఆ క్రమంలో వ్యాపార వర్గాలకు ఎంత దగ్గరయ్యారో సామాన్య ప్రజలకు అంత దూరమయ్యారు. లోగడ నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, తర్వాత ఎన్టీఆర్‌ అమలుపరచిన సంక్షేమ పథకాలను తగ్గించి వేశారు లేదా రద్దుపరచారు. అందుకే ప్రజల విశ్వాసం కోల్పోయి 2004లో పరాజయం పాలవగా, ఆ పరిణామం ప్రజలను సంతోషపెట్టింది. 

కనీసం ఆర్థిక సంస్కరణలకీ, ఇండియా వంటి వెనుకబడిన సమాజంలో ప్రజా సంక్షేమానికీ మధ్య సమతులనాన్ని పాటించాలనే విజ్ఞత అయినా తనకు లేకపోయింది. అందువల్లనే ఈ 21వ శతాబ్దంలో జరిగిన నాలుగు ఎన్నికలలో (2004, 2009, 2014, 2019) మూడింట ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అయిదవ ఎన్నికను ఎదుర్కొంటున్నారు. తన ఆర్థిక సంస్కరణలు, పరిపాలన గొప్పగా ఉండి ఉంటే ప్రతిసారీ గెలవవలసింది! అది కూడా పొత్తుల కోసం చూడకుండా.

ప్రతిసారీ తన ప్రత్యర్థులను మించి ఎడాపెడా హామీలు ఇస్తున్నారంటేనే చంద్రబాబు బలహీనత అర్థమవుతున్నది. మరొక వైపు 2014లో వలె గెలిచినపుడు అయినా సదరు హామీలను ఎంత మాత్రం అమలుపరచక విఫలం కావటాన్ని బట్టి అవి బడ్జెట్‌తో, ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేనివని తెలిసిపోతున్నది. 

అవి అలవిమాలినవని ముందుగా గ్రహించలేనివాడు కాదాయన. అయినప్పటికీ ఆ పని చేశా రంటే, 2014లో, 2019లో చేసి, ఇపుడు 2024 కోసం తిరిగి చేస్తున్నా రంటే, ఆయన ఉద్దేశమే ప్రజలను మోసగించటమనుకోవాలి. ఏమి చేసైనా సరే అధికారం సంపాదించాలన్నమాట!

అదే పని చేసి తలమీదకు తెచ్చుకున్న రెండు ప్రభుత్వాల ఉదాహరణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పొరుగునే ఉన్నాయి. ఒకటి కర్ణాటక, రెండు తెలంగాణ. రెండు చోట్ల కూడా కాంగ్రెస్‌ పార్టీ మితి మీరిన హామీలనిచ్చింది. అవి బడ్జెట్‌ శక్తికి మించిపోగలవని ఆర్థిక వేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా పెడచెవిని పెట్టిన కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపుచ్చి అధికారాన్నయితే సంపాదించింది గానీ, హామీలను అమలుపరచలేక ఏడాది తిరగకముందే తలకిందులవు తున్నది. ప్రజలలో నిరసనలు రెండు రాష్ట్రాలలోనూ మొదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఈసారి ఇచ్చిన హామీలకు ఏటా సుమారు లక్షన్నర కోట్లు అవసరం కాగలవన్నది ఒక అంచనా. అది నిజం కాదని తెలుగుదేశం అధ్యక్షుడు చెప్పదలచుకుంటే, తన హామీలలో దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంత అవుతుందో, రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చినపుడు పరిస్థితి ఏమిటో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి. అది నిజాయితీగల పద్ధతి అవుతుంది. ప్రజలు విజ్ఞులని స్వయంగా చంద్ర బాబు తరచూ గంభీరంగా ప్రకటిస్తుంటారు. ఒక నాయకుని గత పాలనలో ప్రజలకు కలిగే అనుభవం కూడా విజ్ఞతలోకి వస్తుంది.

అందువల్ల, చంద్రబాబు గురించి ప్రజల గత కాలపు నిరాశలను, అప నమ్మకాలను మరచిపోయేటట్లు చేయాలంటే, ఆయన ఈ వివరాలు వెంటనే ప్రకటించాలి. లేనట్లయితే, ఆయనకు 2009లో రాజశేఖర రెడ్డి పెట్టిన ‘ఆల్‌ ఫ్రీ బాబు’ పేరును ప్రజలు తిరిగి గుర్తు చేసుకోగలరు.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement