దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్‌బరేలీ, ఇటు అమేధీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు.
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్‌బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్‌ను ఉంచారు. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment