న్యూఢిల్లీ: భారత్ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో పోలి్చతే భారత్ పసిడి డిమాండ్ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్ నెలకొనడం గమనార్హం.
సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర (దిగుమతి సుంకం, జీఎస్‌టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్ ఇయర్ మొత్తంలో ఆర్‌బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్
మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా
5 % ఎక్కువ. సెంట్రల్ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు
పెంచుకున్నాయి.
∗ మార్చి త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.
∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.
∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది.
∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి.
∗గోల్డ్ రీసైక్లింగ్ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.
∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా.
Comments
Please login to add a commentAdd a comment