సాక్షి, చెన్నై : గల్లంతైన వారి పేర్లన్నీ మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ ఓటరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, కౌంటింగ్ నిలుపుదల కోసం స్టే ఇవ్వలేమని పేర్కొంటూ ఓటరు పిటిషన్ విచారణను ముగించారు. వివరాలు.. ఆస్ట్రేలియా నుంచి వచ్చి తన హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నించిన వైద్యుడు స్వతందిర కన్నన్‌కు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. ఓటరు జాబితాలో తన పేరు గల్లంతు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు.
తన లాంటి వారెందరి పేర్లో జాబితాలో గల్లంతు కావడాన్ని పరిగణించి హైకోర్టులో పిటిషన్ వేశాడు. గల్లంతైన వారి పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని, ఓటుహక్కుకలి ్పంచాలని విన్నవించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ గంగాపూర్వాల, న్యాయమూర్తి చంద్రశేఖరన్ బెంచ్ విచారించింది. ఎన్నికల కమిషన్ తరపున సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచారు. జనవరిలోనే తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరగిందని గుర్తించారు. పిటిషనర్ సంబం«ధిత నియోజకవర్గం లేరని, ఆయన ఆ్రస్టేలియాలో నివాసం ఉన్నారని వివరించారు. 2021లోనే జాబితా నుంచి పిటిషనర్ పేరు తొలగించ బడ్డట్టు, తుది ఓటరు జాబితా ప్రకటించిన సమయంలో ఎందుకు పిటిషనర్ ఆక్షేపన వ్యక్తం చేయలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తుది ఓటరు జాబితా సమయంలోనే పరిశీలించి ఉండాలని, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి అప్పుడే తీసుకొచ్చి ఉండాలని వాదించారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. పేర్లు మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్‌కు అవకాశం కల్పించాలన్న పిటిషనర్ వాదనపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నారు. అలాగే, కోయంబత్తూరు నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్‌ను నిలుపుదల చేయలేమని పేర్కొంటూ, ఈ పిటిషన్ విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడంతో ఓటరుకు మిగిలింది నిరాశే. సర్కారు సినిమాలో తరహా ఏదేని ఉత్తర్వులు వస్తాయన్న ఎదురు చూపులలో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment