జస్లీన్ రాయల్
క్షణ క్షణం సంగీత పర్వం
యువ సంగీతాభిమానులకు అచ్చంగా సరిపోయే మాట... మ్యూజిక్ మేక్స్ ఎవ్రీ థింగ్ బెటర్. ఇట్టే మరిచిపోయే లక్షణం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకు, క్రియేటివిటీని ఎంజాయ్ చేయడం నుంచి క్రియేటివ్ పవర్ పెంచుకోవడం వరకు, జడత్వం నుంచి నిత్యజీవనోత్సాహం వెల్లివిరియడం వరకు, అనామకత్వం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం వరకు ఎన్నోరకాలుగా సంగీతం యువతకు బలం అయింది. సంగీత రత్నాలను వెదుకుతూ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగు పెట్టిన యువతరం ఆ ప్లాట్‌ఫామ్‌లలోనే మ్యూజిక్ స్టార్‌లుగా మెరవడం ఈ తరంలో కనిపిస్తున్న ప్రత్యేకత.
∗ స్పాటిఫైతో ప్రయాణం ప్రారంభించి స్టార్‌గా ఎదిగిన ఆర్టిస్ట్‌లలో జస్లీన్ రాయల్ ఒకరు. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హిట్ బాలీవుడ్ ట్రాక్స్ కంపోజ్ చేసింది. ‘ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి, శ్రోతల అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా మ్యూజిక్ కంపోజింగ్‌లో మార్పులు చేయడానికి స్పాటిఫై ఉపయోగపడింది’ అంటుంది జస్లీన్ రాయల్.
∗ ఆరు సంవత్సరాల వయసులో పాటల కోసం గొంతు సవరించింది బెంగళూరుకు చెందిన దియా వదిరాజ్. రకరకాల మ్యూజిక్ జానర్‌లలో టాలెంటెడ్ సింగర్‌గా పేరు తెచ్చుకుంది. కోల్‌కతాకు చెందిన రనితా బెనర్జీ అయిదు సంవత్సరాల వయసులో ‘సింగింగ్ స్టార్’ షోలో పాల్గొంది. ‘స రే గ మ ప’ లిటిల్ ఛాంప్స్‌లో ఫస్ట్ రన్నర్–అప్‌గా నిలిచింది. ‘స్వీట్ వాయిస్’ రనిత గొంతు నుంచి వచ్చిన ‘జరాసీ ఆహట్’ పాట 6.2 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
∗ మల్టీ టాలెంటెడ్ సింగర్‌గా పేరు తెచ్చుకుంది అంకిత కుందు. రియాల్టీ షోలలో పాడడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిహార్‌కు చెందిన మిథాలీ ఠాకూర్ ‘రైజింగ్ స్టార్’ షోతో ఫేమ్ అయింది. భోజ్‌పూరి, క్లాసికల్, ఫోక్ సాంగ్స్‌ను పాడడంలో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇండియన్–అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ లిశా మిశ్రా పాటలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది. బాలీవుడ్ సినిమాలలో కూడా పాడింది. ఇండియన్ ఐడల్ జూనియర్‌గా 2015లో సంగీత ప్రపంచానికి పరిచయం అయింది భువనేశ్వర్‌కు చెందిన అనన్య నందా. బాలీవుడ్ పాటల్లోనే కాదుక్లాసికల్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. మెలోడియస్ వాయిస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
∗ బోస్టన్ (యూఎస్)లో పుట్టిన అవంతి నగ్రల్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ముంబైకి వచ్చిన తరువాత తన పాషన్‌నే కెరీర్‌గా చేసుకుంది. మ్యూజిక్‌లో రకరకాల జానర్స్‌ను మిక్స్ చేయడంలో గట్టి పట్టు సాధించిన అవంతికి యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఇందులో తన లైవ్ పర్‌ఫార్‌మెన్స్ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. అవంతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
∗ ఆర్ అండ్ బీ, హిప్–హాప్, సోల్, పాప్ మ్యూజిక్‌లలో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటోంది ఇలీన హ్యాట్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ముంబైకి చెందిన సాచి రాజాధ్యక్ష ఆల్ట్–పాప్ మ్యూజిక్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆమె పవర్‌ఫుల్, సోల్ వాయిస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
∗ దియ నుంచి అవంతి వరకు ఎందరో, ఎందరెందరో యంగ్ మ్యూజిషియన్స్ సంగీతం పట్ల అంకితభావంతో సెల్ఫ్–మేడ్ సూపర్‌స్టార్‌లుగా ఎదిగారు. ఎంతోమంది ఔత్సాహికులకు రోల్ మోడల్స్‌గా మారారు.
Comments
Please login to add a commentAdd a comment