డింపుల్ యాదవ్ మనోగతం
మెయిన్‌పురి: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా మార్పు కోసమే ఓటేస్తారని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ధీమా వెలిబుచ్చారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామం సైఫైలో పీటీఐ ప్రత్యేక ముఖాముఖిలో పలు అంశాలపై డింపుల్ తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు...
బీజేపీపై..
బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మునిగిపోయింది. కులాల లెక్కన జనాన్ని విడగొడుతోంది. జనం మనోభావాలతో ఆడుకుంటోంది. కీలక సమస్యల నుంచి జనం దృష్టి మరల్చుతోంది. బీజేపీ రాజకీయ ఒత్తిళ్లతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. విభజన రాజకీయాలతో వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోందని వారికి తెలిసొచి్చంది. అందుకే కేంద్రంలో ఈసారి అధికార మార్పు కోసమే జనం ఓటేస్తారు.
దర్యాప్తు సంస్థలు, ధరలపై..
ఈడీ, సీబీఐ, ఐటీ ఇలా ప్రతి దర్యాప్తు సంస్థనూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దురి్వనియోగం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయిలోనూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ జనాన్ని పీడిస్తోంది. ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు జనాలకు చేరట్లేవు. వాగ్దానాలైతే జోరుగా చేస్తున్నారుగానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు అస్సలు కనిపించట్లేదు. దేశాన్ని బీజేపీ ఎటువైపు తీసుకెళ్తుందో అందరికీ తెలుసు. పోషకాహార లోపం, ఆకలి చావుల రేటింగ్స్, గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఏటికేడు దిగజారుతోంది. మళ్లీ బీజేపీ గెలిస్తే దేశం 15 ఏళ్లు తిరోగమనంలోకి వెళ్లడం ఖాయం. దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తరుణంలో వచ్చిన ఎన్నికలివి.
మోదీ మంగళసూత్రం వ్యాఖ్యలపై
ఇదొక్కటే వాళ్లకు ఆయుధంగా దొరికింది. జనం భవితకు సంబంధించిన ఏ అంశమూ బీజేపీకి పట్టదు. యూపీలో మొత్తం 80 సీట్లు గెలిచేస్తామని అబద్ధాలు చెబుతున్నారు. అందులో నిపుణులు వాళ్లు. కానీ వాళ్ల మాటలను ఈసారి జనం నమ్మట్లేరు. గట్టి గుణపాఠమే చెప్తారు. అత్యంత అవినీతి నేతలను బీజేపీ లాగేసి డ్రై క్లీనింగ్ మెషీన్‌లో పడేస్తోంది. అంతా రాజకీయ లబ్దికోసమే చేస్తుంది.
గెలుపు మెజారిటీ తగ్గడంపై..
మామ ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి చూస్తే భారీ మెజారిటీ అనేది తగ్గడం వాస్తవమే. 2019లో ఆ మెజారిటీ కేవలం 94000కు తగ్గింది. ఎన్నికలు ఎప్పుడూ ఒకేలా జరగవు. ప్రతిసారీ గెలుపును వేర్వేరు కారణాలు ప్రభావితం చేస్తాయి.
తన ప్రచార సరళిపై..
రోజుకు ఎనిమిది, తొమ్మిది మీటింగ్‌లలో పాల్గొంటున్నా. విపక్షాల ‘ఇండియా’ కూటమికి జనం నుంచి వస్తున్న స్పందన అద్భుతం. నా కూతురు అదితి యాదవ్ సైతం తొలిసారిగా ప్రచారంలో పాల్గొంటోంది. గ్రామాలకు వెళ్తూ వారిని కలుస్తోంది. ములాయం మరణంతో వెల్లువెత్తిన సానుభూతి కారణంగానే 2022 మెయిన్‌పురి ఉపఎన్నికల్లో 2.8 లక్షల భారీ మెజారిటీతో ఎస్పీ గెలిచిందన్న బీజేపీ వ్యాఖ్యల్లో నిజంలేదు. జనం మనసుల్లో మేమే ఉన్నాం. ఈసారీ గెలుపు మాదే. ఆర్మీలో పనిచేస్తున్న యువతతోపాటు వృద్ధులు, మహిళలు అంతా బీజేపీ వాగ్దానాలను నెరవేర్చలేదన్న నిస్పృహలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment