BJP: కాఫీ విత్‌ యూత్‌ | Sakshi
Sakshi News home page

BJP: కాఫీ విత్‌ యూత్‌

Published Sat, Apr 20 2024 4:25 AM

Lok sabha elections 2024: BJP Starts Coffee With Youth campaign in Lok Sabha Polls - Sakshi

బీజేపీ యువ మోర్చా కార్యక్రమం

పట్టణ ఓటర్లే లక్ష్యం

సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్‌ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్‌ యూత్‌’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ మోర్చా నేతలు కొత్త ఓటర్లను అడుగుతున్నారు. ముంబైలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో వీటిని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. యువ ఓటర్ల నాడి తెలుసుకుని, వారిని బీజేపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

బూత్‌ స్థాయి నుంచి...
ముంబైలో ఇటీవల పలుచోట్ల దాదాపు 300 మంది యువ ఓటర్లతో బీజేపీ యువ మోర్చా నేతలు ‘కాఫీ పే చర్చ’ నిర్వహించారు. పదేళ్ల్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ చర్చలను విస్తరిస్తున్నారు.

ప్రతి భేటీలో కనీసం 150 నుంచి 200 మంది యువ ఓటర్లుండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ‘కాఫీ పే చర్చ’లో బూత్‌ స్థాయి కార్యకర్త మొదలు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని దాకా పాల్గొంటారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని కనీసం 10 మంది కొత్త, యువ ఓటర్లను ఈ చర్చకు తీసుకొస్తున్నారు. రెస్టారెంట్లు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వినూత్నంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

మోదీ పేర్కొన్న ‘విజన్‌ 2047’ లక్ష్యంతో చర్చ సాగుతోంది. ‘రాబోయే ఐదేళ్లలో దేశంలో యువత పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏం చేస్తే యువతకు దగ్గరవుతుంది? అన్ని రంగాల్లోనూ ప్రపంచంలో భారత్‌ అగ్ర స్థానానికి చేరాలంటే ఏం చేయాలి? అవినీతి నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, పేదరికం లేని ఇళ్లు’ తదితర అంశాలపై రెండు నుంచి మూడు గంటల పాటు కార్యక్రమం జరుగుతోంది. యువ ఓటర్ల సలహాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. 

Advertisement
Advertisement