నిర్మల్ లో కొత్త ప్లాన్ - చెట్ల మీద గంజాయి సాగు | Sakshi
Sakshi News home page

నిర్మల్ లో కొత్త ప్లాన్ - చెట్ల మీద గంజాయి సాగు

Published Fri, Mar 31 2023 1:36 AM

చెట్టు మీద ఉన్న ప్లాస్టిక్‌ డబ్బాలు - Sakshi

● ప్లాస్టిక్‌ డబ్బాలో పెంచుతున్న యువకులు ● రోజు గంజాయి సేవిస్తున్న వైనం ● బోథ్‌లో విచ్చలవిడిగా గంజాయి లభ్యం

బోథ్‌: గతంలో పోలీసులు దాడులు చేయడంతో గంజాయి పంట వేయడం, సరఫరా గత కొన్ని రోజులుగా బోథ్‌ మండల వ్యాప్తంగా తగ్గిపోయింది. ఇటీవల మళ్లీ బోథ్‌ మండల వ్యాప్తంగా సరఫరా అవుతోంది. మండల కేంద్రంలోని సాయినగర్‌ను ఆనుకుని ఉన్న వెంచర్‌లోని ఓ మామిడి చెట్టుకు పైభాగంలో కొంతమంది యువకులు ప్లాస్టిక్‌ డబ్బాలో మట్టిని నింపి అందులో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. ప్రతి రోజు కొంతమంది యువకులు చెట్టు దగ్గరికి చేరుకుని గంజాయిని సేవిస్తున్నారు. చేనుల్లో సైతం ఎవరికంట పడకుంగా చెట్ల పైన డబ్బాల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తెలుస్తోంది.

విచ్చలవిడిగా గంజాయి సరఫరా..

మండలంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. 10వ తరగతి మొదలుకుని విద్యార్థులు, యువకులలతో పాటు పలువురు గంజాయికి బానిసవుతున్నారు. మండల కేంద్రంలోని కల్లుబట్టీ దగ్గర, రాత్రి వేళల్లో స్థానిక పాత ప్రభుత్వ కళాశాల భవనం, పిప్పల్‌ధరి రోడ్డు, పెద్ద వాగు సమీపంలో, మోడల్‌ స్కూల్‌ వెనుక భాగంలో, పలు వెంచర్‌లల్లో గంజాయిని సేవిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత గంజాయికి బానియ్యారు. బడికి వెళ్లాల్సిన విద్యార్థులు సైతం గంజాయికి అలవాటు పడటం ఆందోళన కలిగిస్తోంది.

పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలి..

యువత గంజాయికి బానిస కావడం ఆందోళన చెందే విషయం.. ఈ విషయంపై పోలీసులు ప్రత్యేక చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. గంజాయి సరఫరాపై నిఘా పెట్టాలి. గతకొంత కాలంగా బోథ్‌లో గంజాయి సరఫరా చాపకింద నీరులా సాగుతోంది. నిరంతరంగా పెట్రోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఉందని, సాయంత్రం వేళల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కల్లు బట్టీల వద్ద కొంతమంది విక్రయిస్తున్నట్లు సమాచారం.

ప్లాస్టిక్‌ డబ్బాల్లోని గంజాయి మొక్కలు
1/1

ప్లాస్టిక్‌ డబ్బాల్లోని గంజాయి మొక్కలు

Advertisement
Advertisement