అమెరికాకు వెళ్తే పొట్ట తిప్పలేనా? | Sakshi
Sakshi News home page

US: అమెరికాకు వెళ్తే పొట్ట తిప్పలేనా?

Published Thu, Apr 18 2024 12:37 PM

What Do Indians In The USA Mostly Eat - Sakshi

"తినుటకు ఉన్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి
రమ్మనుటకు ఉన్నచాలు తగ ఆలును బిడ్డలు ఒక్కచోట
కూర్చొనుటకు ఉన్నచాలు ! " అన్నాడు కవి.

ఇది అత్యాశకు పోకుండా ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే పాత కాలం నాటిమాట. ఇపుడు కాలం మారింది , మనుష్యుల మనస్తత్వాలు మారాయి. మామూలు నడకతో లాభం లేదని అంతా పరుగులు తీస్తున్న రోజులు ఇవి. కుటుంబంతో కలిసి కూర్చొని ఉన్నదేదో తినాలంటే కుదరడం లేదు, మనిషి లేనిదాని కోసం అర్రులు చాస్తున్నాడు, కొత్తకొత్త రుచులు కోరుకుంటున్నాడు. ‘ గడుకంబలైన దొర్కక ఆకలిని దీర్ప కల్లు దాగితిమి మా కరువు దీర ‘ అన్నది మా మాతామహుడు వరకవి భూమగౌడు కాలంనాటి మాట.

అంతటి దారిద్యం, కరువుకాలం నేను మాత్రం చూడలేదు. నా చిన్నప్పుడు , మా తల్లి దండ్రులు ఉన్నప్పుడు బడికి పోవడానికి ముందు మేము ఊదుకుంటూ తాగింది వేడివేడి గడుకంబలి, అంచుకు పెట్టుకున్నది వక్కకారం. మధ్యాహ్నం బడి వదలగానే ఆకలితో పరుగు పరుగున ఇంటికి వచ్చి ఆవురావురుమని ఆరగించింది పప్పన్నం. సాయంత్రం బడి చుట్టి కాగానే పొలోమని బయటికి వచ్చి ఆడిపాడి అలసిసొలసి ఇంటికి వచ్చి , చేతులు కూడా సరిగా కడుక్కోకుండా తిన్నవి, రాత్రి దీపాలకన్న ముందే కట్టెల పొయి వెలిగించి మా అమ్మ చేసిపెట్టిన జొన్నరొట్టెలు కాయగూరల కూరతో. మధ్య మధ్య సర్వపిండి , మొలక బియ్యం, వరి కుడుములు, మక్క కంకులు, జొన్నపిసికిళ్ళు, అనుప, అలిసంద గుడాలు లాంటి చిరుతిళ్ళు సరేసరి, చుట్టాలు వచ్చినప్పుడు ఒక కోడి ప్రాణం హరీ ! పండగల ప్రత్యేక వంటకాలు దసరా గారెలు, ఉగాది బూరెలు, సంక్రాతి చకినాలు ఉండనే ఉంటాయి.

జీవితంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లో.. ఆ తర్వాత మజిలీ మారింది అమెరికాకు. దేశం కానీ దేశం వచ్చాక.. ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య భోజనం. ఇండియాలో ఏ మాటకు ఆ మాట.. ఉద్యోగాలు చేసే వాళ్లంతా ఇంట్లో భార్యలు చేసింది పుష్టిగా తినడమే కాకుండా.. బాక్సుల్లోనూ ఇంటి భోజనం తీసుకుని వస్తారు. ముంబై లాంటి చోట్ల అయితే వేడివేడిగా సమయానికి ఇంటి భోజనం తెచ్చిచ్చే "డబ్బావాలా"లు కూడా ఉన్నారు. ఎటొచ్చి అమెరికాలో ఈ పరిస్థితి లేదు. బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి.. ఆడా,మగా అంతా సమానమే. అంటే భర్తకు సమయానికి వండి పెట్టే భార్య కనిపించడం అరుదు. ఎవరి మానాన వాళ్లు ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అయి ఉద్యోగాలకు, వ్యాపారాలకు పరుగులు తీస్తారు. ఇక ఇంటి భోజనమా.? ఆ మాట వారాంతాల్లో తప్ప చాలా మందికి సాధ్యం కాదు. మరి బయటికెళ్లిన వాళ్లు ఏం తినాలి? అమెరికాలో ప్రతీ గల్లీలో ఫుడ్‌ సెంటర్లు కనిపిస్తాయి. ఆఫీసు క్యాంటీన్లు, బస్‌స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు ఎక్కడ చూసినా.. ఏదో బ్రాండ్‌ ఫుడ్‌ సెంటర్‌ కనిపిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లన్నింటిలో కలిపి ఎక్కువగా కనిపించేవి ఇవి

  1. సబ్‌వే
  2. స్టార్‌బక్స్‌
  3. మెక్‌ డొనాల్డ్స్‌
  4. డంకిన్‌
  5. బర్గర్‌ కింగ్‌
  6. టాకో బెల్‌
  7. డొమినో
  8. పిజ్జా హట్‌
  9. వెండీస్‌
  10. డైరీ క్వీన్‌

సగటు భారతీయుడి కంటే.. నాలుగింతలు నాన్‌వెజ్‌ ఎక్కువగా తింటారు. అక్కడి వాళ్ల అలవాటు ఇది. ఇక ఎక్కువ మంది ఉదయం పూట లాగించేవి శాండ్‌విచ్‌లు. కాల్చిన బ్రెడ్‌, మధ్యలో ఆమ్లెట్‌ లేదా వెజ్‌ పీస్‌లు. పక్కన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌. కొందరు ఓట్స్‌ తింటారు. పళ్ల ముక్కలు తినేవాళ్లు కూడా బాగానే కనిపిస్తారు. మన దగ్గరి కంటే ఎక్కువగా కాఫీలు పీపాల కొద్దీ తాగేస్తుంటారు. అయితే కాఫీలో పాలు, చక్కెర కలుపుకుని కమ్మగా తాగే మనకు ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే, చల్లటి ప్రాంతం కాబట్టి చాలా మంది రోజుకు ఐదారు కాఫీలు తాగేస్తుంటారు. మధ్యాహ్నం భోజనంలో ఎక్కువ మంది తినేవి బర్గర్లు, పిజ్జాలు. ఇందులో వందల వెరైటీలున్నాయి. ఏది తిన్నా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ పక్కన నంజుకోవచ్చు. గ్రిల్డ్‌ చికెన్‌, గ్రిల్డ్‌ చీస్‌ కూడా బాగానే తింటారు.

ఉడికించిన కోడిగుడ్లు, బంగాళ దుంప, ఫ్రైడ్‌ చికెన్‌, బార్బెక్యూలు ఎక్కువగా కనిపించే, తినే ఫుడ్‌లు. తినే తిండికి అదనంగా గ్లాసుల కొద్దీ కూల్‌డ్రింకులు తాగుతూనే ఉంటారు. కూల్‌డ్రింక్‌ సర్వసాధారణం అని వచ్చిన వారానికి తెలిసిపోయింది. హాట్‌ డాగ్స్‌, లాబ్‌స్టర్‌ రోల్స్‌, బఫెలో వింగ్స్‌ వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా.. మన వాళ్లు కూడా నంజుకుని తినేస్తున్నారు. సాయంత్రం అయితే మాత్రం చాలా మంది ఇష్టపడేది డ్రింక్‌తో కలిపి తినే ఫుడ్‌. వీటికి అదనంగా మిల్క్‌ షేక్‌లు, ఐస్‌క్రీంలు. మరి ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి పరిస్థితి కాస్తా విచిత్రంగా మారుతుంది. వీకెండ్‌లో వీలైనన్ని కూరలు వండుకోవడం, బకెట్‌ నిండా సాంబారు తయారు చేసుకోవడం, దోశ/ఇడ్లీ పిండి రుబ్బుకోవడం, శనగలు/రాజ్మా లాంటివి నానబెట్టుకోవడం.. ఓ రకంగా శని/ఆది ఇంటి చాకిరిలో మునిగి తేలుతారు.

ఇళ్లలో మన బీరువాల కంటే పెద్ద ఫ్రిడ్జ్‌లుండడం వల్ల తయారు చేసిన వాటన్నింటిని మళ్లీ వినియోగించుకునేలా ఐస్‌ట్రే తరహాలో ఉన్న బాక్స్‌ల్లో పెట్టి ప్యాక్‌ చేస్తారు. వాటిని ఏ రోజు అవసరం బట్టి ఆ రోజు తీసి మైక్రోఓవెన్‌లో పెట్టి వేడి చేసుకుని తింటారు. వీలైనన్ని సార్లు ఇంట్లో... తప్పనిసరి పరిస్థితుల్లో బయట తినడం మనవాళ్ల అలవాటు. కొత్తగా వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు.. ఖర్చు తగ్గించుకుందామనుకున్న వాళ్లు.. చిన్న హీటర్‌ బాక్సుల్లో నూడుల్స్‌/కూరగాయ ముక్కలు వేసుకుని ఆఫీసుకు వస్తారు. సరిగ్గా లంచ్‌ సమయానికి పావుగంట ముందు దానికి ప్లగ్‌ పెడితే.. వేడి వేడి భోజనం రెడీ. ఇప్పుడు అమెరికాలోనూ ఇండియన్‌ ఫుడ్‌ బాగా పెరిగింది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్‌లతో పాటు స్వీట్లు, హాట్లు.. అన్నీ దొరుకుతున్నాయి.

ఈస్ట్‌ కోస్ట్‌ అంటే న్యూయార్క్‌, న్యూజెర్సీ, టెక్సాస్‌లోని హూస్టన్‌, డాలస్‌లలో ఎక్కడ పడితే అక్కడ బోలెడు ఇండియన్‌ రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ఏ మాటకా మాట.. రుచి కూడా బాగుండేలా బ్రహ్మండంగా చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చే చాలా మంది విద్యార్థులకు ఇక్కడే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు. పైగా మోటెల్స్‌లో, ఔట్‌స్కర్ట్స్‌లో దాబాల తరహాలో ఇంట్లోనే ఉండే రెస్టారెంట్లను కూడా మనవాళ్లు మెయింటెయిన్‌ చేస్తున్నారు. ఏ రోజుకా రోజు ఓ పది రకాల వెజ్‌/నాన్‌వెజ్‌ ఐటమ్‌లు కావాల్సినన్నీ లాగించొచ్చు. దీన్నే అక్కడి పరిభాషలో బ్రంచ్‌ అంటారు. అంటే బ్రేక్‌ఫాస్ట్‌ సమయం దాటిన తర్వాత.. లంచ్‌ కంటే కొంచెం ముందు.. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంటలోపు పూటుగా తినే రకం అన్నమాట. పది నుంచి 15 డాలర్లు ఇస్తే.. మన నోటికి , కడుపుకు సంతృప్త స్థాయిలో తిని రావొచ్చు.

పిల్లలు పెద్దలై దేశ సరిహద్దులు దాటాక , మేమే వాళ్లకు అమెరికా లో అతిథులమయ్యాక , వాళ్ల మాట వినాలి కదా. ఇండియాలో తిన్నట్టు వెజిటేరియనే కావాలి అంటే కుదరదు. అది వాళ్ళు ఇంట్లో గ్రిల్ మీద కాల్చిన మాంసాహారమైనా తిన్నాం. బయట స్ట్రీట్ ఫుడ్ పాయింట్, రెస్టారెంట్ లకు తీసుకుపోయినా వాళ్ళ వెంట నడిచాము. అది మెక్ డోనాల్డ్స్ సాండ్ విచ్, మెక్సికన్ చిపొట్లే , మాంగోలియన్ చికెన్, ఇటాలియన్ పిజ్జా తాజాతాజా ఫుడ్ ఏదైనా తిన్నాం. జపనీస్ సుశి పచ్చి చేపయినా కళ్ళు మూసుకొని నోట్లో పెట్టాము. సముద్రతీర విహారయాత్రల్లో ప్రాణంతో ఉన్న ఎండ్రకాయలు, పాముల్లాంటి జీవులను మా కళ్ళముందే క్రూరంగా, వేడివేడి కడాయి నూనెలో వేయించి ఇస్తుంటే మాత్రం తినడానికి మాకయితే మనసొప్పలేదు.

అలా ఒకానొక ఆదివారం ఓ అమెరికన్ రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు, అరగంట వెయిటింగ్ తర్వాత లభించిన సీట్లలో కూర్చొని, మా పిల్లలు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వచ్చిన బర్గర్ లాంటి ఫుడ్ , దాని ఊరూ పేరూ తెలియకుండా నోట్లో పెట్టిన మరుక్షణం మాకో అనుమానం వచ్చింది. నేను కాస్త నమిలి చూసాక తెలిసింది, ఎప్పుడో సర్వీస్ లో ఉన్నప్పుడు పాతబస్తీలో ఓ మిత్రుడితో కలిసి వెళ్లి సరదాగా తిన్నప్పటి ఫుడ్ రుచి అది అని. నేను అదే మాట మా వాళ్ల చెవిలో వేశాను. వెంటనే వాష్ రూం వైపు పరుగున వెళ్ళి బొళ్లుమని వాంతి చేసుకున్నారు, ఏదో ఘోరం జరిగినట్లు. ఎవరి దేశ కాల పరిస్థితులను బట్టి వాళ్ళవాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అది ఆరోగ్య కరమైందా కాదా, అయితే ఆ ఆహారం మనకు సరిపడుతుందా లేదా? అన్నదే, అంతేకానీ అందులో అపచారమేమీ లేదు ‘ అని !
వేముల ప్రభాకర్‌

(చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !)

Advertisement
Advertisement