జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్‌ | BRS Leader KCR Fires On PM Modi And CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్‌

Published Sun, May 5 2024 5:01 AM | Last Updated on Sun, May 5 2024 5:01 AM

మంచిర్యాల బస్సు యాత్రలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

మంచిర్యాల బస్సు యాత్రలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను 

మోదీ నదులెత్తుకుపోతున్నా సీఎంకు కుయ్యి కుట్కు లేదు 

మంచిర్యాల రోడ్‌ షోలో మాజీ సీఎం కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  జైళ్లకు భయపడనని, ప్రాణాలైనా బలిపెట్టి పోరాడుతా కానీ తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోనని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయని చెప్పారు. తెలంగాణ హక్కులు కాపాడుకునేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శనివారం సాయంత్రం మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు.  

మోదీ గోదావరిని ఎత్తుకపోతుండు 
‘గోదావరి నదిని ప్రధాని మోదీ ఎత్తుకొనిపోతున్నాడు. అన్యాయం చేస్తామంటున్నాడు. ఊకుందామా? కృష్ణానదిని అప్పగించినా ఈ ముఖ్యమంత్రికి కుయ్యి, కుట్కు లేదు. గోదావరిని తమిళనాడుకు అప్పగిస్తే నోరు తెరుస్తలేడు. అడ్డగోలుగా మాట్లాడుతూ గుడ్లు పీకుతా, పేగులు మెడలేసుకుంటా, లాగుల తొండలు జొర్రగొడుతా, జైల్లో వేస్తా అంటున్నాడు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన. ఈ జైళ్లకు నేను భయపడతానా? భయపడితే ఈ రాష్ట్రమొచ్చేదా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.  

శిఖలు పట్టుకుని కొట్టుకుంటున్నారు 
‘రాష్ట్రంలో కరెంట్‌ కోతలు మొదలయ్యాయి. కరెంట్‌ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. కరెంటు ఎందుకు పోతోంది. పట్టణాల్లో ఒక రూపాయికే పరిశుభ్రమైన నీరు, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి ఎందుకు రావడం లేదు? విదేశీ విద్యా రుణం లేదు.. మెడికల్‌ కాలేజీల పర్మీషన్లు లేవు. వసతిగృహాల్లో విద్యార్థులు కలుíÙతాహారంతో చనిపోతున్నారు. నాలుగు నెలల దాకా వచ్చినవన్నీ ఇప్పుడు యాడికి పోయినయి. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు, సీఎంఆర్‌ఎఫ్‌ ఏడపాయె. 

రైతులకు బోనస్‌ రూ.500, తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెడితే ఆడవాళ్లు శిఖలు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆటో కార్మీకులు ఆగమయ్యారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం నోటికి ఏది వస్తే అది చెబుతున్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్లు పెడుతున్నారు. రుణమాఫీ చేయాలని అడిగితే డిసెంబర్‌ 9, వంద రోజులు, ఆగస్టు 15 అంటున్నారు..’ అని మాజీ సీఎం ధ్వజమెత్తారు.  

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు 
‘మేం పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసినం. ఇప్పుడు హరితహారాల్లో చెట్లు ఎండిపోతున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో చెట్లు మొలుస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోతోంది. బీఆర్‌ఎస్‌ పనులన్నీ నిలిపివేశారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇప్పుడు పంటలను కొనే దిక్కులేదు. ఐదెకరాలకే రైతుబంధు అంటున్నారు. ఆరు, ఏడు ఎకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారు?’ అని కేసీఆర్‌ నిలదీశారు.  

బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్లే.. 
‘నరేంద్ర మోదీ నా మెడపై కత్తిపెట్టి ఆ్రస్టేలియా బొగ్గు కొనాలన్నా నేను కొనలే. కానీ ఈ ముఖ్యమంత్రి దావోస్, స్విట్జర్లాండ్‌ వెళ్లి మాట ముచ్చట చేసుకుని వచ్చాడు. మోదీ పదేళ్ల కిందట గెలిచినప్పుడు ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు. బేటీ బచావో బేటీ పఢావో, సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌.. ఏదీ జరగలేదు. మోదీది అంతా ఉత్త ‘గ్యాస్‌’ కంపెనీ తప్ప మరేం లేదు. కాంగ్రెస్‌ అన్నిట్లో వైఫల్యం చెందింది. బీజేపీతోటి ఒరిగిందేమీ లేదు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లే. బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు శ్రీరామరక్ష. మోసపోయి, గోసపడొద్దు..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కోరారు. 

మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవాల్నా? 
‘పాత ఆదిలాబాద్‌లో కొత్తగా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాలు ఏర్పాటు చేస్తే ఎలక్షన్‌ తెల్లారే ముఖ్యమంత్రి ఆ కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటున్నారు. మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవల్నా? ఇక్కడ ఆగర్భ శ్రీమంతుడు, భూగర్భ కార్మికుడు పోటీలో ఉన్నారు. కార్మీకుడు గెలవాలా? శ్రీమంతుడు గెలవాల్నా? జిల్లా ఉండాలంటే ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ గెలవాలి. ఈశ్వర్‌ 26 ఏళ్లు కార్మీకుడిగా పని చేశారు. బ్యాలెట్‌ యుద్ధంలో మంచిర్యాల గుండెను చీల్చి ఈశ్వర్‌ను గెలిపించాలి..’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశా­రు. ఈ రోడ్‌ షోలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, పుట్ట మధు, నాయకులు విజిత్‌రావు పాల్గొన్నారు.

కౌశిక్‌రెడ్డి ఇంట్లో కేసీఆర్‌ బస 
నేడు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం 
వీణవంక (హుజూరాబాద్‌):   మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారం తర్వాత కేసీఆర్‌ శనివారం రాత్రి కరీంనగర్‌ జిల్లా వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడే రాత్రి బస చేయనున్న మాజీ సీఎం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యకర్తలు, ప్రజలతో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కౌశిక్‌రెడ్డి ఇంటి పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 20 వేల మంది పాల్గొనేలా సమీకరణ జరుపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనం తర్వాత కౌశిక్‌రెడ్డి ఇంటి నుంచి మెయిన్‌ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ వెంట బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ తదితర నేతలు ఉన్నారు.

గోదావరికి కేసీఆర్‌ పూజలు
చీరసారె సమర్పించి మొక్కులు 
గోదావరిఖని: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి నదికి పూజలు నిర్వహించారు. బస్సుయాత్రలో పాల్గొనడానికి శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్‌లో గోదావరిఖని చేరుకున్న కేసీఆర్‌.. స్థానిక ప్రధాన చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం సింగరేణి ఇల్లెందు అతిథి గృహంలో బస చేశారు. శనివారం సాయంత్రం వరకు అక్కడే సేదదీరిన కేసీఆర్‌.. బస్సుయాత్ర కోసం మంచిర్యాల బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో గోదావరినది వంతెన వద్ద కాన్వాయ్‌ ఆపారు. 

గోదావరి నదిలో పూలు జల్లి పూజలు చేసి.. చీరసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్‌ వెంట మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తదితరులున్నారు. మంచిర్యాలలో బస్సుయాత్ర ముగించుకున్న తర్వాత కేసీఆర్‌ గోదావరిఖనిలో కాసేపు ఆగారు. పోలీస్‌హౌసింగ్‌ బోర్డు మాజీ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దామోదర్‌ కుటుంబ సభ్యులతో ముచ్చటించి తేనీటివిందు స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్‌ బయలుదేరి వెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement