ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.! | Sakshi
Sakshi News home page

ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!

Published Thu, Apr 11 2024 10:23 AM

Would You Rather See The Statue Of Liberty Or Niagara Falls In US - Sakshi

పౌరులు ఎప్పుడు బయటకు వచ్చినా చిరునవ్వుతో కనబడాలని ఇటలీలోని మిలాన్లో చట్టం చేశారట, ఆస్పత్రులు అంత్యక్రియలకు వెళ్లేవారు తప్ప ! అదేమిటో కాని అలాంటి ఏ చట్టమూ లేకున్నా అమెరికన్స్ , వాళ్ళ మనసులో ఏమైనా ఉండనిగాక, కొత్త పాత అనకుండా , మనిషిని చూడగానే ఒక చిరునవ్వు విసరడం వారి సహృదయతను, సంస్కారాన్ని చాటుతుంది. అక్కడి వారిలో ఈ లక్షణం నేను చూసిన ఇటు పసిఫిక్ తీరం లాసంజెల్స్ నుండి గల్ఫ్ అఫ్ మెక్సికో డల్లాస్ మీదుగా అట్లాంటిక్ మహా సముద్రం న్యూయార్క్ వరకు దారి పొడుగునా గమనించాను. ఎప్పుడు అమెరికా వచ్చినా మొక్కుబడిగా సమీప సందర్శనీయ స్థలాలు మాత్రమే చూస్తున్నాం, అలాకాదు ఈసారి ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామనుకున్నాం.

లాస్‌ఎంజెల్స్ నుంచి ఈస్ట్‌ కోస్ట్‌ ట్రిప్‌కు వెళ్లాం. అలా మొదట మేము వెళ్ళింది బఫెలో కు. ఇటు అమెరికా ( న్యూ యార్క్ ) అటు కెనడా ( ఒంటారియా ) ల మధ్య గుర్రపునాడా ఆకారంలోనున్న జలపాతం నయాగరా అందాలను చూసాం. ఇది 167 ఫీట్ల ఎత్తు నుండి ఎక్కువ వెడల్పులో కిందికి జారుతుంటే.. దాన్ని సమీపంగా చూడాలని చిన్న పడవలో వెళ్ళాం, రెయిన్‌ కోట్ వేసుకున్నా తడిసినంత పనైంది. ఈ జలపాతాన్ని రెండు దేశాల వైపు నుంచి చూడొచ్చు. అమెరికా, కెనడాలను విడదీసేది కూడా నయాగారా జలపాతమే. ఈ నదిపైనే రెయిన్‌బో అనే బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జిపై నడుచుకుంటూ రెండు దేశాలు దాటేయవచ్చు. అయితే రెండు వైపులా ఎంట్రీ పాయింట్‌, చెక్‌ పాయింట్‌, టోల్‌ గేట్‌ ఉంటాయి. చాలా మంది కెనడా వైపు నుంచి చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.

కెనడా వైపు నుంచి మరింత ముందుకు.. అంటే జలపాతం చివరి వరకు చూడొచ్చంటారు. పైగా కొండపైనే గుహలను కూడా కెనడా వైపు నుంచి చూసే అవకాశం ఉంది. ఆ రోజు రాత్రి వర్షంలో కారు ప్రయాణం, మధ్యరాత్రి ఎప్పుడో న్యూయార్క్ చేరుకొని హోటల్ హాలిడే ఇన్ లో బస. ఇది మన గుజరాతీ పటేల్ లు నడుపుతున్న హోటల్ కావడం విశేషం. పేరుకు అమెరికానే కానీ.. పటేల్‌ బ్రదర్స్‌ స్టోర్‌లు మనకు దాదాపు అమెరికా అంతటా కనిపిస్తాయి. ఇండియాలో దొరికే ఏ సరుకయినా.. పటేల్‌ బ్రదర్స్‌లో కనిపిస్తుంది. జండూ బామ్‌ నుంచి బఠానీల దాకా, పల్లీల నుంచి కొత్తిమీర దాకా కేరాఫ్‌ పటేల్‌ బ్రదర్స్‌. అమెరికాలో గుజరాతీల వ్యాపారం ఎంత పెద్దదంటే.. మనం ఊహించలేనంత పెద్ద టర్నోవర్‌ నడుస్తుందని అక్కడ సెటిల్ అయిన మనవాళ్లు చెబుతారు. గుజరాతీ వ్యాపారులు చాలా ఇన్‌ఫ్యూయన్సర్లని పేరు. అందుకే గుజరాతీల ఈవెంట్లలో మేయర్ల నుంచి గవర్నర్ల దాకా అతిథులుగా కనిపిస్తారు. పటేల్‌ బ్రదర్స్‌ హోటల్‌ వాళ్ళే ఏర్పాటు చేసిన బస్‌లో ‘ న్యూయార్క్ టైం స్క్వేర్ ’ వైపు వెళ్ళాం.

న్యూయార్క్ యూఎస్లోనే ఎక్కువ జనాభా కలిగిన నగరం. దీన్ని ప్రపంచ రాజధాని కూడా అంటార , ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉండడంవల్ల కాబోలు. నాకు దీన్ని చూస్తుంటే అచ్చం మన ముంబైలాగే అనిపించింది, వీధుల్లో జన సంచారం ఎక్కువ, ఇండియన్ రెస్టారెంట్లు కూడా. అయితే ఆధునికత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 1931 లోనే నిర్మించబడిన, ఎన్నిసార్లు పిడుగులు పడ్డా చెక్కు చెదరని, 102 అంతస్తుల ‘ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ’ ఎక్కి న్యూయార్క్ నగర అందాలను చూసాము. మేడం టుస్సాడ్ మ్యూజియం గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్టోబర్1 నాడు కారులో బయలుదేరి ‘లిబర్టీ ఐల్యాండ్’కు వెళ్ళాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వేచ్చా స్వాతంత్రాలకు ప్రతీకయైన, రోమన్ దేవతలావున్న‘ లిబర్టీ స్టాచ్యు ’ చూసాం. ఇది ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్తోలీ రూపొందించిన 151 అడుగుల ఎత్తయిన శిల్పం, 1886 లో ఫ్రాన్స్ ప్రజల నుండి యూ ఎస్ కు వచ్చిన కానుక. నిజంగానే గొప్ప విగ్రహం అనిపించింది.

విగ్రహం కాలి బొటన వేలు మనిషి సైజంతా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే.. విగ్రహం లోపల ఉండే మెట్ల దారి గుండా తలలోని కిరీటం వరకు ఎక్కొచ్చు. కింది నుంచి లెక్కిస్తే 354 మెట్లు ఎక్కితే తల వరకు వస్తాం. అక్కడి నుంచి మరో 192 మెట్లు ఎక్కితే చివరి వరకు చేరుకుంటాం. తలకున్న కిరీటంలో 25 కిటీకీలున్నాయి. ఈ భూమి మీద ఉన్న 25 అత్యంత విలువైన అణిముత్యాలను దృష్టిలో పెట్టుకుని 25 కిటీకీలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కిరీటం నుంచి ఏడు కాంతి రేఖలు కనిపిస్తాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో ఖండాన్ని ప్రతిబింబిస్తాయి ‘ఎల్లిస్ ఐ ల్యాండ్ ’ ఒకప్పటి యూఎస్ ఎంట్రీ పోర్ట్. 1892 నుండి 1954 వరకు దాదాపు 12 మిలియన్ల మంది వలసదారులు యూఎస్ లో అడుగు పెట్టింది ఇక్కడి నుండే. ఇక్కడున్న ఇమ్మిగ్రేషన్ జాతీయ మ్యూజియం చరిత్ర పై ఆసక్తి వున్నవారు తప్పనిసరి చూడాల్సింది.

గాంధీజయంతి రోజు మేము వాషింగ్టన్ డి సి చేరుకున్నాము. ప్రపంచంలో శాంతి అయినా ఆశాంతి అయినా అది మాచేతిలో పని అని విర్రవీగే అగ్రరాజ్యం అమెరికా రాజధాని నగరం అది. చూడడానికి మాత్రం విశాలమైన రోడ్లు , అందమైన భవనాలతో ప్రశాంతంగా కనబడింది. ప్రపంచ స్థాయి వ్యూహాలకు నిలయమైన ఆ దేశ అధ్యక్షులవారి అధికారిక నివాసం ‘వైట్ హౌస్ ’ అనబడే శ్వేత సౌధం ఉన్నది వాషింగ్టన్ డి సి లోనే. మేము దాన్ని బయటి నుండే చూసి అక్కడి నుండి బయటపడ్డాం. వైట్‌ హౌజ్‌ అందాలను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే జులై 4న ఇండిపెండెన్స్‌డే రోజున చూడాలి.

ఆ రోజు రాత్రి అద్భుతమైన రీతిలో బాణా సంచా కాల్చి కనువిందు చేస్తారు. యూఎస్ ‘ పార్లమెంట్ హౌస్ ’ చూసాం , అప్పుడు జరుగుతున్న 112 వ కాంగ్రెస్ సెనెట్ సమావేశాలు సెనెటర్ పాస్ కూడా సంపాదించి సందర్శకుల గ్యాలరీ నుండి చూశాం, అక్కడ సెక్యూరిటీ చాలా పకడ్బంధిగా వున్నా మాకేమి ఇబ్బంది కలగలేదు. అక్కడి నుంచి మా కారు పిట్స్ బర్గ్ గుట్ట మీదున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వైపు మళ్ళింది . సరిగ్గా స్వామివారి దర్శన సమయానికి మేము అక్కడికి చేరుకోగాలిగాము. ఈ ఆలయం గురించి మరో కథనంలో రాస్తాను.
వేముల ప్రభాకర్‌

(చదవండి: US: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!)

Advertisement
Advertisement