ఏడాదిలో కాంగ్రెస్‌ సర్కార్‌ పతనం: కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

ఏడాదిలో కాంగ్రెస్‌ సర్కార్‌ పతనం: కేసీఆర్‌

Published Wed, Apr 17 2024 5:34 AM

BRS Leader KCR Fires On Congress Govt - Sakshi

నారాయణపేటలో సీఎం భయం చూస్తే అలాగే అన్పిస్తోంది 

సుల్తాన్‌పూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు 

సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడు పార్టీ మారతారో తెలియదు.. ఆ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవు 

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలను, రైతులను కాపాడుకున్నాం  

తెలంగాణను సాధించినట్లుగానే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తెస్తా 

హామీలు నెరవేరాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురుకుపెట్టాలి 

బీజేపీ అక్కరకు రాని చుట్టం.. ఆ పార్టీకి ఓటేస్తే మంజీరాలో వేసినట్లే 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు ఏడాదిలో పడిపోతుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వంపై జనం తిరగబడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడు పార్టీ మారతారో తెలియదని వ్యాఖ్యానించారు. తెలంగాణను తెచ్చినట్లుగానే రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు.  

రుణమాఫీపై మాట మార్చారు: ‘రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతాంగం ప్రభుత్వంపై తిరగబడుతోంది. సర్వే రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవు. నారాయణపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి భయం చూస్తే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. ముఖ్యమంత్రే జంప్‌ కొడతడో.. ఎవరు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తరో తెలుస్తలేదు. ఇక్కడో మాట మాట్లాడి ఢిల్లీకి వెళ్లి బీజేపీకి ఓట్లేయాలని టీవీల్లో చెబుతాడు.. ఎవరికి ఎవరు బీ టీమో, ఎవరు ఎవరితో కలిసిపోయారో ప్రజలు అలోచన చేయాలి.

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట మార్చింది. డిసెంబర్‌ 9 లోపే రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆగస్టు 15 అంటోంది. రేవూరి ప్రకాష్ రెడ్డి అయితే తర్వాత చేస్తామంటున్నారు. కానీ రూ.2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్‌ఎస్‌ తీసుకుంటుంది. ఇందుకోసం అందరం కలిసి పోరాటం చేస్తాం..’అని కేసీఆర్‌ చెప్పారు. 

బోనస్‌..బోగసేనా? 
‘తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మేం గౌరవం ఇచ్చాం. ఉద్యోగులకు పీఆర్‌సీలు ఇచ్చాం.. వేతనాలు పెంచాం.. మేధావులైన ఉద్యోగులు ఆలోచన చేయాలి.. ఈ ఎన్నికల్లో పిచ్చోళ్లలాగా ఓట్లు వేయొద్దు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలను కడుపులో పెట్టుకున్నాం. రైతులను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకున్నాం. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. కానీ ఈ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేదు. పంటలు చేతికందాయి కానీ కొనే దిక్కులేదు. పంటలకు బోనస్‌ అన్నరు.. బోనస్‌ బోగసేనా? 

రాష్ట్రమంతా పోస్టుకార్డు ఉద్యమం 
    రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తాం. పంటలకు బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లాలో రైతులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమం రాష్ట్రమంతా చేపడతాం. ఊరుకునేది లేదు. అందరం కలిసి కొట్లాడతాం. ఎన్నికల కోడ్‌ ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. బోనస్‌కు సంబంధించిన బాండ్లు రాసివ్వాలి. అలా రాసిచ్చినా మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయం. రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. నష్ట పోయిన పంటలకు రూ.25 వేల సాయం వెంటనే చెల్లించాలి..’అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

అప్పుడు వరి కోతలు..కరెంటు కోతలు 
‘మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా వరి కోతలే ఉండేవి. ఇప్పుడు కరెంట్‌ కోతలు, క్రాప్‌ హాలిడేలు ఉంటున్నాయి. మేము కడుపులో పెట్టుకున్న రైతులు ఇప్పుడు ఆగం అవుతున్నారు. లిల్లీపుట్‌ గాళ్ల ప్రభుత్వం మెదక్, నిజామాబాద్‌ జిల్లాలకు సింగూరు నుంచి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టుపై నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కోల్డ్‌స్టోరేజీలో పెడుతోంది.

ఈ ఎత్తిపోతల పథకాలు పూర్తి కావాలన్నా, కాళేశ్వరం జలాలు రావాలన్నా బీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించాలి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని తెలివిలేనోళ్లు అంటున్నారు. ఇప్పుడే బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలి. సీట్లు గెలిపించాలి. ఆనాడు టీఆర్‌ఎస్‌ను గెలిపించకపోతే తెలంగాణ వచ్చేదా? బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుంది. పాలిచ్చే బర్రెను వదిలేసి, దున్నపోతుకు గడ్డేస్తే ప్రయోజనం ఉండదు..’అని మాజీ సీఎం అన్నారు. 

కాంగ్రెస్‌కు ఓట్లేస్తే హమీలన్నీ ఎగపెడతారు 
‘మిషన్‌ భగీరథ పథకాన్ని తెచ్చి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాం. ఈ పథకాలను సరిగ్గా నడపడం కూడా ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేత కావడం లేదు. ఆరేళ్లుగా వచ్చిన నల్లా నీళ్లు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయి? కళ్యాణలక్ష్మి పథకంతో పాటు, తులం బంగారం ఇస్తామని ముఖం చాటేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. మళ్లీ ఆ పార్టీకి ఓట్లేస్తే ఇచ్చిన హామీలన్నీ ఎగపెడతారు.

బీజేపీ అక్కరకు రాని చుట్టం. పదేళ్ల పాలనలో తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు. జాతీయ ప్రాజెక్టు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఆ పార్టీకి ఓటేస్తే మంజీరాలో పడేసినట్లే. తెలంగాణకు న్యాయం జరగాలంటే ఈ రెండు ఆగం పార్టీలను కాకుండా, తెలంగాణ హక్కుల కోసం పేగులు తెగేలా కొట్లాడే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి..’అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

లిల్లీపుట్‌ గాళ్ల ప్రభుత్వం అంబేడ్కర్‌ను పట్టించుకోలేదు  
‘ఇంటికి గుడ్డి లక్ష్మి వచ్చినట్లుగానే లిల్లీపుట్‌ గాళ్లకు అధికారం వచ్చింది. సేవ చేయమని ప్రజలు అధికారం ఇస్తే అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నరు. సచివాలయం సమీపంలో 125 అడుగుల ఎత్తున అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ లిల్లీపుట్‌ గాళ్ల ప్రభుత్వం ఆ మహనీయుని జయంతి రోజున అక్కడికి వెళ్లలేదు. పూలమాల వేయలేదు. అంజలి ఘటించలేదు. గేట్లు బంద్‌ చేసి తాళాలు వేశారు. ఇంత అహంకారమా? కండ కావరమా? కొత్త సచివాలయానికి కూడా అంబేడ్కర్‌ పేరు ఉంది కదా.. సిగ్గు లేకుండా ఆ సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారు? అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌కు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చురుకు పెట్టాలె..’అని మాజీ సీఎం విజ్ఞప్తి చేశారు. 

పోలీసుల అరాచకాలు బంద్‌ చేయాలి 
‘రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు బంధ్‌ చేయాలి. లేకుంటే మేము అధికారంలోకి వచ్చాక మీ గతేందో ఆలోచన చేయాలి. అన్నీ రికార్డు చేస్తున్నాం. పార్టీ బహిరంగ సభకు వస్తున్న 150 లారీలను పోలీసులు ఆపారు. బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను పీకేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా మేం ఒక్కరోజు కూడా దౌర్జన్యం చేయలేదు. ప్రజల స్పందన చూసైనా డీజీపీ మారాలి. లేనిపక్షంలో ప్రజలే మీ ముందుకు వస్తారు జాగ్రత్త..’అని కేసీఆర్‌ హెచ్చరించారు. బహిరంగసభలో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్, మెదక్‌ పార్లమెంట్‌ స్థానాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గాలి అనిల్‌కుమార్, వెంకట్రాంరెడ్డి, పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement