Sakshi News home page

కాంగ్రెస్‌తో పొత్తుకు టీఎంసీ చెల్లు.. అసలు కారణాలేంటి?

Published Wed, Jan 24 2024 9:02 PM

Its Over Says Mamata Banerjee What Led To Call It Off With Congress - Sakshi

కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. సీట్ల పంపకంలో ప్రతిపాదనలన్నింటినీ కాంగ్రెస్ తిరస్కరించిందని పేర్కొన్న దీది.. బెంగాల్‌లోని 42 స్థానాల్లో తృణమూల్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా మమతా బెనర్జీ, కాంగ్రెస్ మధ్య స్నేహం బీటలు వారినట్లయింది.

పరస్పర ఆరోపణలు..
అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య విభేదం ఇదే మొదటిసారి కాదు. గత రెండు నెలలుగా జరుగుతున్న పరస్పర ఆరోపణల తర్వాత మమతా బెనర్జీ నుంచి నేడు ఈ ప్రకటన వచ్చింది. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై విభేదాలు అప్పుడప్పుడు బహిరంగంగానే బయటకొచ్చాయి. మమతా బెనర్జీని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి  తీవ్రంగా విమర్శించేవారు. ఆమెపై ఈ మధ్య విమర్శల స్థాయిని పెంచారు. ఒకానొక సందర్భంలో ఆమెను అవకాశవాది, దలాల్ అని దుయ్యబట్టారు.

నిజానికి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎప్పుడూ కలవరపెడుతోంది. సోనియా గాంధీతో మమతా బెనర్జీ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. అధిర్ చౌదరి, అబ్దుల్ మన్నన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ వర్గం.. మమతపై విమర్శలకు దిగేది. తృణమూల్ తమ నాయకులను దూరం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి తృణమూల్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. నిజానికి తృణమూల్‌తో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో సానుకూలంగా లేరు, వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు.

గతంలో చేతులు కలిపారు.. కానీ..
గతంలోనే కాంగ్రెస్, టీఎంసీ చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలు గతంలో 2001 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా 2011లో టీఎంసీ, కాంగ్రెస్ కూటమి.. బెంగాల్‌లో 34 సంవత్సరాల తర్వాత సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దారితీసింది. అయితే, ఈసారి లోక్‌సభ ఎన్నికలకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

అసమ్మతికి మొదటి సంకేతం..
బెంగాల్‌లోని 42 సీట్లలో రెండింటిలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ను తృణమూల్ కాంగ్రెస్  కోరింది. కనీసం 8-10 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడింది. తృణమూల్ అభ్యర్థనను తిరస్కరించడం రెండు పార్టీల మధ్య అసమ్మతికి మొదటి సంకేతం. ఈ రెండు స్థానాల్లో.. అధిర్ రంజన్ కంచుకోట బెర్హంపూర్, 2019లో కాంగ్రెస్ గెలిచిన మాల్దా సౌత్‌లు ఉన్నాయి.

టీఎంసీ సీట్ల షేరింగ్ ఫార్ములా
2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీల పనితీరు ఆధారంగా సీట్ల షేరింగ్ ఫార్ములా ఉండాలని మమతా బెనర్జీ కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిందని, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని తృణమూల్ పేర్కొంది. కాంగ్రెస్ "పెద్దన్న" అధికారాన్ని విడనాడాలని, ప్రాంతీయ పార్టీలు తమ బలమైన స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కోవాలని టీఎంసీ అధిష్టానం ప్రతిపాదించింది.

మోగిన ప్రమాద ఘంటికలు..
అయితే.. గత వారం తృణమూల్ నేతలతో జరిగిన సమావేశం అనంతరం అధిర్ రంజన్ చౌదరి బెర్హంపూర్‌తో సహా మొత్తం 42 స్థానాల్లో పార్టీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్‌లో ప్రమాద ఘంటికలు మోగించింది. మమతా బెనర్జీ సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీని రాహుల్ గాంధీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొన్ని సార్లు స్థానిక నాయకులు తెలియక ఏదో మాట్లాడుతారు.. అవన్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. మమతా బెనర్జీ తనకు మంచి సన్నిహితురాలని చెప్పుకొచ్చారు.

మళ్లీ చిగురించలేని స్థాయికి..
అయితే.. ఈ పరిణామాల అనంతరం ఇండియా కూటమికి  మమతా బెనర్జీ స్వస్తి పలికారు. దీంతో జనవరి 25న పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో తృణమూల్ కాంగ్రెస్ చేరే అవకాశం లేదు. మమతా బెనర్జీ ప్రకటన తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. టీఎంసీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని చెప్పారు. అయితే.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, తృణమూల్ స్నేహం మళ్లీ చిగురించలేని స్థితికి చేరిందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్!

Advertisement

What’s your opinion

Advertisement