కాషాయ జెండాలు కడుపు నింపుతయా?  | Sakshi
Sakshi News home page

కాషాయ జెండాలు కడుపు నింపుతయా? 

Published Fri, Apr 26 2024 4:31 AM

KCR fire in Bhuvangiri road show and corner meetings

పదేళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది? 

భువనగిరి రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లలో కేసీఆర్‌ ఫైర్‌ 

బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకటే.. 

ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటోంది.. 

ఇంకో పార్టీ దేవుడి మీద ఒట్లు పెట్టుకుంటోంది. 

తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్సే... రైతుబంధుకు పరిమితి ఎందుకు? వరికి రూ.500 బోనస్‌ ఏది? 

మంచిగున్న తెలంగాణ ఆగమైతోంది... బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే పోరాడుతామని వెల్లడి 

సాక్షి, యాదాద్రి:  దేశంలో ఎన్నో సమస్యలుంటే మోదీ ప్రభుత్వానికి అక్షింతలు కలుపుడు, తీర్థం పుచ్చుకునుడు, పులిహోర పొట్లాలు తినుడుతోనే సరిపోయిందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని.. కానీ గత పదేళ్లలో ఏ ఒక్క వర్గం ప్రజలకూ న్యాయం జరగలేదని మండిపడ్డారు.
 

ఈ కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతాయా, పొలాలకు నీళ్లు తెస్తయా అని విమర్శించారు. బీజేపీ హయాంలో పెద్దపెద్ద నేరాలు జరిగాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే మొదటి శత్రువని.. ఆ పార్టీ వల్ల 58ఏళ్లు అనేక కష్టాలు పడ్డామని పేర్కొన్నారు. 
 

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర గురువారం యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ పట్టణంలో రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని.. లేకుంటే ఎమ్మెల్యేలను కొంటాం.. నన్ను దించేస్తామని మోదీ బెదిరించారు. ఈ రాష్ట్రానికి వచ్చే రూ.25 వేల కోట్లు ఇవ్వబోమన్నారు.. ఇదే బీజేపీ దందా. కానీ నా తలకాయ తెగిపడ్డా సరే బోర్లకు మీటర్లు పెట్టనని చెప్పిన. రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మోదీ సర్కారు తెలంగాణకు నవోదయ పాఠశాలలు, మెడికల్‌ కాలేజీలు ఇవ్వలేదు. 

పదేళ్లు కష్టపడి నిలబెట్టిన 
1956 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ శత్రువు కాంగ్రెస్‌ పార్టీ. భువనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతాలు ఎంతో గోసపడ్డాయి. వలస లు, అనేక రకాల బాధలు ఉండేవి. ఎవరూ ధైర్యం చేయ కపోయినా తెలంగాణ డెవలప్‌ కావాలని ఉద్యమం ప్రారంభించిన. 15 ఏళ్లు కొట్లాడిన. చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని కష్టపడి నిలబెట్టిన. మంచి పథకాలు పెట్టిన. రైతుబంధు, 24గంటల విద్యుత్‌ ఇచ్చినం. నీళ్లు ఇచ్చుకున్నాం. ఒక్క గింజ మిగలకుండా ధాన్యం కొనుగోళ్లు చేసినం.  

రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి.. 
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. రూ.15 వేలు రైతు బంధు, 2లక్షలు రుణ మాఫీ అన్నారు. రైతుబంధు అందరికీ వచ్చిందా? 5 ఎకరాలకే ఇస్తామంటూ దగా చేస్తున్నరు. మంచిగున్న కరెంటును నాశనం చేసి పొలాలను ఎండబెడుతున్నరు. 
 

ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్‌ చేస్తున్నరు. బీఆర్‌ఎస్‌ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగినయ్‌. కాంగ్రెస్‌ రాగానే 225 మంది రైతులు చనిపోయారు. రైతుబీమా దిక్కే లేదు. వరికి రూ.500 బోనస్‌ ఏది? మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఏది? ఆడపిల్ల లకు స్కూటీలు ఏమైనయ్‌? కల్యాణలక్ష్మి తులం బంగారం ఏది?
 

మంచిగున్న తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా? పోరాడాలా? కేసీఆర్‌ను కిందపడేసి కొట్లాడుమంటే ఎట్లా? బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాడుతాం’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. 

తెలంగాణ కోసమే కేసీఆర్‌ను పుట్టించిండు 
‘‘భగవంతుడు కేసీఆర్‌ను తెలంగాణ కోసమే పుట్టించిండు. తెలంగాణ ప్రజల గుండె చీల్చితే  కనిపించేది కేసీఆర్‌.. కేసీఆర్‌ గుండె చీలిస్తే  కనిపించేది తెలంగాణ ప్రజలు. కొట్లాడటానికి బలం కావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. 
 

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే లోక్‌సభలో మోదీపై ఫైటింగ్‌ చేస్తరు. భువనగిరిలో బలహీన వర్గాలకు చెందిన క్యామ మల్లేశ్‌ను గెలిపించండి. మా వయసు మీరిపోతోంది. ఈ తెలంగాణ మీది.. ముందుకు నడిపేది మీరు.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభం జరుగుతుందో వారికి ఓటు వేయండి’’ అని యువతకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

ఓట్లు.. ఒట్లు.. ఇదే తీరు? 
‘‘ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది. ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టుపెట్టుకుంటోంది. ఒకడేమో ఓట్లు.. ఇంకొకడేమో ఒట్లు అంటున్నరు. మనం అద్భుతంగా యాదాద్రి నిర్మాణం చేసుకున్నాం. 
 

ఏనాడైనా యాదగిరిగుట్టను ఓట్ల కోసం వాడుకున్నామా? ఒకడొచ్చి బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీం అంటాడు. భువనగిరిలోనేమో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు కలిసిపోయి మున్సిపల్‌ చైర్మన్‌ను తీసేసి కాంగ్రెస్‌ వాళ్లు చైర్మన్, బీజేపీ వాళ్లు వైస్‌ చైర్మన్‌ తీసుకున్నారు. మరి ఎవరు ఎవరికి బీ టీమ్‌ ప్రజలు గుర్తించాలి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement