Sakshi News home page

అవినీతి వెలగపండు

Published Sat, Apr 20 2024 3:59 AM

TDP MLA Ramakrishna list of irregularities: Andhra pradesh - Sakshi

కొండలను పిండేశారు  

విశాఖలో విష సంస్కృతికి నాంది  

కోడిపందేలు, జూదాలతో రూ. కోట్లు దండుకున్న వైనం 

ఆ ఎమ్మెల్యే కన్ను పడితే కబ్జానే  

ఇదేమి ‘రామ..రామ’ అంటూ ప్రజల హాహాకారాలు

భవ్య పరిపాలనా రాజధానిలో సూర్యోదయ దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ఆ ఎమ్మెల్యే అవినీతికి అంతేలేదు. ఆయన పేరు చెబితే భూ కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు, దందాలే గుర్తొస్తాయి. కొండలు సైతం భయంతో కంపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వరుసగా మూడుసార్లు ఎన్నికైనా ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అవినీతి, అక్రమాలు మాత్రం భారీగానే వెలగబెట్టారు. ఫలితంగా ‘రామ..రామ’.. ఇదేమి దోపిడీ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.     

ఆరిలోవ(విశాఖ): విశాఖ నగర ప్రజలకు తెలియని కత్తికట్టి ఆడే కోడి పందేల విష సంస్కృతిని ఆ ఎమ్మెల్యే ఇక్కడి జూదరులకు పరిచయం చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ వెనుక జీవీఎంసీకి చెందిన పదెకరాల ఖాళీ స్థలంలో 2016 నుంచి 2020 వరకు సుమారు నాలుగేళ్లపాటు వరుసగా సంక్రాంతి సమయంలో బరులు ఏర్పాటు చేయించి భారీగానే వెనకేసుకున్నారు. ప్రజల జేబులు గుల్లచేశారు. ఆరిలోవ, జోడుగుళ్లపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాలను 2015లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పట్లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని ఐద్వా ఆధ్వర్యంలో స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోలేదు. 

► రుషికొండ ప్రాంతంలో రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో పోయినట్టు ఎమ్మెల్యే చూపించారు. ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం పొందారు.   
► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక దందాలకు పాల్పడ్డారు. జోడుగుళ్లపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యత్నానికి బ్రేక్‌ పడింది. 

► ఎంవీపీ కాలనీలో సెక్టార్‌–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్‌ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్‌లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్‌ నిర్మాణాన్ని నిలిపేశారు. అప్పటి వైఎస్సార్‌ సీపీ నాయకుడు (ప్రస్తుతం జనసేన కార్పొరేటర్‌) పీతల మూర్తియాదవ్‌ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది.    

► రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్వాయర్‌ వెనుక 2017లో పెగదిలికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లోని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 18 పాకలు వేశారు. దీనిపై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జీవీఎంసీ అధికారులు ఆ పాకలను తొలగించారు. అయినా పట్టువదలకుండా వేసిన పాకలను మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచి్చంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు పేదలకు చెందిన పాకలను తొలగించారని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. 

ఎమ్మెల్యేపై కేసులు  

► 2020 మార్చి 15న ఎమ్మెల్యే నిర్వహించే మద్యం షాపుల్లో ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేపట్టారు. ఆ దుకాణాల్లో కల్తీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు తన అనుచరులతో ధర్నా చేపట్టారు. ఎక్సైజ్‌ పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ 353, 501 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  

► 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేపై మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

► రుషికొండ వద్ద ప్రభుత్వానికి చెందిన స్థలంలో గెడ్డ భాగాన్ని ఆక్రమించినట్లు 2011లో రూరల్‌ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేపై భూ ఆక్రమణ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత అధికారులను బెదిరించి ఆయన కేసును కొట్టివేయించుకున్నారు.

Advertisement
Advertisement