సకుటుంబ సపరివార సమేతంగా | Sakshi
Sakshi News home page

సకుటుంబ సపరివార సమేతంగా

Published Mon, Apr 29 2024 5:57 AM

YSR family in election campaign at ysr kadapa district

 ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ కుటుంబం 

కడప బాధ్యతల్లో వైఎస్‌ సోదరులు రవీంద్రనాథ్, సు«దీకర్‌, మధుకర్‌

వివిధ నియోజకవర్గాలు, మండలాల బాధ్యతలో ఇతర కుటుంబ సభ్యులు 

ఇంటింటి ప్రచారంలో సీఎం జగన్‌ సతీమణి భారతమ్మ, వైఎస్‌ సమతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి

సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమాన్ని వివరిస్తూ ప్రచారం 

మరోమారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని అభ్యర్థన 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని వినతి 

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్‌ జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్‌ జగన్‌కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్‌ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్‌ జగన్‌ను, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. 

కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. 
వైఎస్సార్‌ సోదరులు వైఎస్‌ రవీంద్రనాథరెడ్డి, వైఎస్‌ సు«దీకర్‌రెడ్డి, వైఎస్‌ మధుకర్‌రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్‌ అభిõÙక్‌రెడ్డి, తొండూరుకు వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి ఇన్‌చార్జిలుగా ఉన్నా­రు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్‌రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. 

వేముల మండల ఇన్‌చార్జిగా డాక్టర్‌ ఈసీ దినేష్‌రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్‌ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్‌ మేనల్లుడు యువరాజ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయం కోసం సీఎం వైఎస్‌ జగన్‌  సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సతీమణి వైఎస్‌ సమతారెడ్డి, సోదరి వైఎస్‌ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్‌ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్‌ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. 

జగన్‌ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్‌ భారతమ్మ 
పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్‌ జగన్‌ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రా­యమన్నారు.  ఆమె ఆదివారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులి­వెందులలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లా­డారు.

తమకు సీఎం జగన్‌ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్‌సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. 

మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పు­డున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్‌ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్‌ కుటుంబానికి బలమని,   40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చు­కోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్‌ సమత, వైఎస్‌ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్‌ చందన ఉన్నారు.

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్‌ కుటుంబం
​​​​​​​ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్‌ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్‌ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   

Advertisement
Advertisement