సాక్షి, పులివెందుల: గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం జగన్ చూపించారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పులివెందులోని సీఎస్ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగించారు.
‘‘ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్‌లో జరిగింది మీరంతా చూశారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒకసారి ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో నాలుగుసార్లు సీబీఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు నాలుగుసార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్లపాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం.
...మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత వర్షమనేది దూరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ క్రింద చెరువులు కావొచ్చు, పీబీసీ క్రింద చెరువులు కావొచ్చు, జీకేఎల్ఐ క్రింద చెరువులకు కావొచ్చు సమృద్ధిగా అరటి, చీని రైతులకు సమృద్ధిగా మనం నీళ్లు అందించామంటే జగనన్న ముందుచూపుతో సీబీఆర్లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వల్లనే సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి తెలియజేస్తున్నా.
..ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు మన జిల్లా రైతాంగానికి రూ.750 కోట్లు పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రూ.1,100 కోట్లు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్‌పుట్ సబ్సిడీ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే అందింది. జగనన్న హయాంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు రూ.278 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. 2023 ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో దానికి సంబంధించి పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా.
..ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో ఒక్కసారి చూడండి. రైతులకు ప్రయోజనకరంగా మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యామ్ లు నిర్మించడం జరిగింది. మరోవైపు చక్రాయపేట మండలం చూడండి. గాలేరు నగరి హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటివాగు డ్యామ్ ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజీ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్లు వస్తే మనం అక్కడ పంప్ హౌస్ల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉందనే విషయాన్ని అందరికీ మనవి చేస్తున్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌస్ ను కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల మాదిరి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నా.
...మరి ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మన తప్పులను చూపలేక, మనల్ని తప్పుబట్టలేక చేసేదేమీలేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపుగా మన మీదకు వస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకు వస్తున్నారు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారాలు చేస్తున్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తున్నారు ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అది నిజమవుతుందనేది చంద్రబాబు, ఎల్లోమీడియా సిద్ధాంతం. వాళ్ల ట్రాప్లో ఎవరూ పడొద్దని చెప్పి మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసొచ్చినా, ప్యాకేజీ స్టార్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు, పరోక్షంగా కాంగ్రెస్ కావొచ్చు, ఎల్లోమీడియా కావొచ్చు మీరు ఎన్ని తప్పుడు హామీలిచ్చినా జగన్ మోహన్ రెడ్డిని టచ్ చేయలేరని తెలియజేస్తున్నా చంద్రబాబు అండ్ కోకు.
...మీకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కడు ఆయనకు అండగా రాష్ట్రంలో లక్షలమంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు జగన్ మోహన్ రెడ్డి గార్కి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి గార్కి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటున్నారు. కాబట్టి ఎంతమంది కలిసొచ్చినా సరే జగన్మోహన్‌రెడ్డి గారి విజయాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ కూడా ఆపలేరు.
...2019 లో మీరు ఎలా ఆదరించారో, ఆశీర్వదించారో మరి 2024 ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్నపైనా, అదేవిధంగా ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాపైనా మెండుగా ఉంచాలని, 2019కి మించిన ఘన విజయాన్ని అందించాలని మళ్లీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరుపేరున ప్రతి అన్న, తమ్ముడ్ని, ప్రతి అక్కచెల్లెమ్మకు మనవి చేస్తున్నా’’ అని అవినాష్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment