దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య! | Sakshi
Sakshi News home page

దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!

Published Sun, Apr 28 2024 8:14 AM

wife murders husband

సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు.   

Advertisement
Advertisement