సభకు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

సభకు సర్వం సిద్ధం

Published Tue, Apr 16 2024 6:45 AM

సుల్తాన్‌పూర్‌ వద్ద సభా స్థలాన్ని పరిశీలిస్తున్న 
చింతా ప్రభాకర్‌, క్రాంతి తదితరులు - Sakshi

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లో జరుగనున్న బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు గులాబీ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు ఇటు మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల నుంచి కూడా జనసమీకరణ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ కానున్న నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గులాబీ శ్రేణులు జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధినేత బహిరంగ సభ మరింత ఊపునిస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

రోడ్డు మార్గం ద్వారా..

కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగసభ స్థలానికి చేరుకుంటారని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా స్థలానికి చేరుకుంటారని, బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారని చెబుతున్నారు. మండిపోతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని సాయంత్రం వేళల్లో ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

భారీ జనసమీకరణే లక్ష్యం..

కేసీఆర్‌ హాజరుకానున్న ఈ బహిరంగ సభను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అందోల్‌ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, సంగారెడ్డి, నర్సాపూర్‌ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించాలని భావిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 20 వేలకు పైగా జనాలను తరలించాలని చూస్తున్నారు. అలాగే నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ శ్రేణులు ఈ సభకు తరలిరానున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాలకు వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

విజయవంతం చేయండి: చింతా

బహిరంగసభ స్థలాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు హాజరయ్యే ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ బహిరంగసభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని కోరారు.

సుల్తాన్‌పూర్‌లో నేడు

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

హాజరు కానున్న

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

ఏర్పాట్లు పూర్తి చేసిన నాయకులు

జన సమీకరణకు కసరత్తు

Advertisement
Advertisement