Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్‌ | Sakshi
Sakshi News home page

Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్‌

Published Fri, Jun 2 2023 6:35 PM

Hyderabad Metro To Charge Toilet Fee In All stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో రైల్ అధికారులు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్‌ టాయిలెట్లలో ఉపయోగించే వారి నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ చార్జీలను నేటి నుంచే(జూన్‌2) వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్‌లో టాయిలెట్‌ వాడకానికి 5 రూపాయలు, యూరినల్‌ వాడకానికి రూ.2 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

కాగా ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని ఉపయోగించినందుకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయడం లేదు. కానీ ఇకపై వాటికి డబ్బులు వసూలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే మెట్రో చార్జీల రాయితీల్లో కోతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు తాజా నిర్ణయం మరింత భారం కానుంది.

ఇక ఇటీవలె మెట్రో చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌పైన ప్రయాణం చేస్తున్న వారికి ఇప్పటి వరకు చార్జీల్లో 10 శాతం రాయితీ ఉండగా.. ఈ రాయితీపైన కోత విధిస్తున్నట్లు  ప్రకటించారు. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేశారు. అదే విధంగా  గుర్తించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ ధరలను సైతం రూ.100కు పెంచింది. 

చదవండి: తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్‌ తమిళిసై డ్యాన్స్‌

Advertisement
 
Advertisement
 
Advertisement