యుద్ధం నీడలో ‘వైద్యం’ పూర్తి! | Sakshi
Sakshi News home page

యుద్ధం నీడలో ‘వైద్యం’ పూర్తి!

Published Wed, Apr 3 2024 5:04 AM

Graduation ceremony in AIG Hospital  - Sakshi

ఉక్రెయిన్‌–ఉజ్బెకిస్తాన్‌ నుంచి ఎంబీబీఎస్‌ పాసైన 210 మంది విద్యార్థులు 

వారిలో 86 మంది అమ్మాయిలు కూడా.. 

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నుల పండువగా గ్రాడ్యుయేషన్‌ వేడుక

దేశంకాని దేశంలో ఎంబీబీఎస్‌ కోర్సు చదివేందుకు రెక్కలు కట్టుకొని వెళ్లారు.. ఓ కాలేజీలో తొలి సెమిస్టర్‌ పూర్తి చేసి రెండో  సెమిస్టర్‌లోకి అడుగుపెట్టారు. అంతలోనే ఒక్కసారిగా దేశమంతా బాంబుల మోత, కాల్పుల శబ్దాలతో విలవిల్లాడారు.. కేంద్రం చొరవతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశం చేరుకున్నా ఆగిన చదువును కొనసాగించాలన్న పట్టుదలతో తొలుత 2–3 నెలలు ఆన్‌లైన్‌ చదువులు చదివి.. ఆ తర్వాత కన్నవారిని, కేంద్రాన్ని ఒప్పించి మరో దేశంలోని కాలేజీలో కోర్సును పూర్తిచేసి స్వదేశానికి తిరిగొచ్చారు. రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం తాలూకు మనోవేదనను  అధిగమించి.. అన్ని పరీక్షల్లోనూ విజయం  సాధించిన 210 మంది వైద్య విద్యార్థుల  విజయగాథ ఇది. 

లక్డీకాపూల్‌: ఉక్రెయిన్‌లోని జపోరిఝియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చేపట్టిన ఎంబీబీఎస్‌ కోర్సును.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారా స్టేట్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తిచేసిన 10 రాష్ట్రాలకు చెందిన 210 మంది విద్యార్థులకు మంగళవారం హైదరాబాద్‌ గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నులపండువగా పట్టాల పంపిణీ జరిగింది. 86 మంది విద్యార్థినులు సహా మొత్తం 210 మంది ఉజ్బెకిస్తాన్‌ వెళ్లి కోర్సు పూర్తిచేశారు.

అయితే జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) సూచనల మేరకు మొత్తం 210 మంది విద్యార్థులకు.. వారు ఎంబీబీఎస్‌ కోర్సు మొదలుపెట్టిన ఉక్రెయిన్‌లోని జపోరిఝియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ నుంచే పట్టాలు రావడం గమనార్హం. కాగా, ఎంబీబీఎస్‌ పాసైన విద్యార్థుల్లో 110 మంది ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ) రాయగా 81 మంది తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. వారిలోనూ 34 మంది అమ్మాయిలు ఉన్నారు. 

ఆ విద్యార్థులది అపార కృషి: ఉజ్బెకిస్తాన్‌ రాయబారి 
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత్‌లో ఉజ్బెకిస్తాన్‌ రాయబారి సర్దోర్‌ రుస్తంబేవ్‌ మాట్లాడుతూ విద్యార్థులంతా అపార కృషితోపాటు అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని మరీ విజయం సాధించారన్నారు. వాళ్ల విజయంలో తమ దేశం పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు. యుద్ధ కాలంలో విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వచ్చేలా చొరవ చూపడంతోపాటు తిరిగి వారిని ఉబ్జెకిస్తాన్‌ పంపడంలో కీలకపాత్ర పోషించిన నియో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఎండీ, ఉజ్బెకిస్తాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్‌ దివ్యా రాజ్‌రెడ్డిని అభినందించారు.

అలాగే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన అనుమతులు ఇచ్చిన కేంద్రానికి, జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాషా సంఘం చైర్మన్‌ పి. విజయబాబు, డాక్టర్‌ దివ్యారాజ్‌రెడ్డి, ఉజ్బెకిస్తాన్‌ ఎంబసీ ఫస్ట్‌ సెక్రటరీ ఎస్‌. సుయరొవ్, ఉజ్బెకిస్తాన్‌ ఎంబసీ కౌన్సిలర్‌ ఐ. సొలియెవ్, నియో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సీఈఓ డాక్టర్‌ బీవీకే రాజ్, ఏఐజీ ఆస్పత్రి వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ సాహూ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement