లోక్‌సభ ఎన్నికల హడావిడి.. నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్ధులు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావిడి.. నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్ధులు

Published Fri, Apr 19 2024 3:02 PM

Telangana MP Candidates Submit Their Nomination Forms  - Sakshi

తెలంగాణలో లోక్​సభ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

శుక్రవారం నిజామాబాద్ లోక్ సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినషన్ దాఖలు చేశారు. బాజిరెడ్డికి వెంట మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు.  

పసుపు రైతులతో కలిసి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్లకు చెందిన పసుపు రైతులు ధర్మపురి అర్వింద్‌ నామినేషన్‌లో పాల్గొన్నారు. పసుపు రైతులు సమర్పించిన చందాలతో  ధర్మపురి అర్వింద్‌ నామినేషన్ రుసుమును చెల్లించారు. 

కరీంనగర్ జిల్లా బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ తరుపున ఆ పార్టీ నేతలు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల, బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణలు రిటర్నింగ్ అధికారికి  బండి సంజయ్ నామినేషన్ పత్రాలను అందించారు.  

మహబూబ్​నగర్​ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్​ రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చల్లా వంశీ నామినేషన్లు పూర్తి అయి కార్నర్​ మీటింగ్​ ముగిసిన అనంతరం మహబూబాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహించే జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు.

పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.  

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్‌ఎస్‌ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేశారు. ఆర్‌ఎస్‌ ప్రవీవ్‌ కుమార్‌ వెంట మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, జైపాల్ యాదవ్‌లు పాల్గొన్నారు. 

 ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా వినోద్ రావు తాండ్ర నామినేషన్ దాఖలు చేశారు.  

పెద్దపల్లి  బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement