Sakshi News home page

Visakhapatnam: పెద్దలకే ప్యాకేజీ

Published Wed, Apr 17 2024 5:45 AM

- - Sakshi

కింద స్థాయి నాయకులపై చిన్న చూపు

 రగిలిపోతున్న జనసేన, టీడీపీ శ్రేణులు

 ఎన్నికల ప్రచారానికి దూరం దూరం

సాక్షి, విశాఖపట్నం: పొత్తులో ఒకరికొకరు సీట్లను సర్దుబాటు చేసుకున్న కూటమి అభ్యర్థులు మిత్రపక్ష పార్టీల పెద్దలకే ప్యాకేజీల్లో పెద్దపీట వేస్తున్నారు. తమపై చిన్న చూపు చూస్తున్నారన్న భావనలో చోటా మోటా నాయకులున్నారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో సీట్లను ఆశించి భంగపడ్డారు. ఆరంభంలో వీరు తమ అధినేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. మరికొందరు తిరుగు బావుటా ఎగురవేశారు. నోటిఫికేషన్‌తో పాటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు దక్కించుకున్న కూటమి అభ్యర్థులు బుజ్జగింపుల పర్వానికి దిగారు. టికెట్లు ఆశించి భంగ పడ్డ వారితో పాటు పార్టీలో కీలక నాయకుల ఇళ్లకు వెళ్లారు.

వారి స్థాయిని బట్టి విడతల వారీ ప్యాకేజీలకు ఒప్పించారు. ఇలా ప్యాకేజీ సెటిల్‌మెంట్లు రూ.లక్షలు, కోట్లలో జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీటికి తలొగ్గిన నేతలకు ఇప్పటికే ప్యాకేజీ సొమ్మును కొంతమేర పంపిణీ చేశారు. ఎలక్షన్‌ ప్యాకేజీతో అలక వీడిన నేతలు కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్తున్నారు. అయితే దిగువ స్థాయి నాయకులకు మాత్రం ఈ పరిణామం మింగుడు పడడం లేదు. వీరికి కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్యాకేజీ సొమ్ములో తమకు కూడా కొద్దోగొప్పో ఇవ్వకుండా వారే స్వాహా చేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కొన్ని చోట్ల తక్కువ ఖర్చుతో అయిపోయే విందు భోజనాలతోనే సరిపెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇలా మనస్తాపంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులు బరిలో ఉన్న చోట ప్యాకేజీ అందుకున్న పెద్ద నేతలే తప్ప కింది స్థాయి క్యాడర్‌ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

ఇదీ పరిస్థితి..
భీమిలి టికెట్‌ను కూటమిలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు. ఈ సీటును జనసేన నుంచి పంచకర్ల సందీప్‌, టీడీపీ నుంచి కోరాడ రాజబాబు ఆశించారు. ఆఖరి నిమిషంలో ఈ సీటును గంటా తన్నుకుపోవడంతో తొలుత వీరు అలకబూనారు. రాజబాబు అయితే గంటాపై తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పరిస్థితిని గ్రహించిన గంటా.. రాజబాబు ఇంటికి వెళ్లి బుజ్జగించారు. సందీప్‌కూ ‘సర్ది’ చెప్పారు. వీరిద్దరినీ భారీ ప్యాకేజీతో దారిలోకి తెచ్చుకోవడంతోనే గంటా వెంట ప్రచారంలో పాల్గొంటున్నారన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది.

అలాగే విశాఖ ఉత్తర టికెట్‌ను బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు కేటాయించారు. అక్కడ జనసేనలో కిందిస్థాయి శ్రేణులకు ప్యాకేజీ అందకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలిసింది. పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు టీడీపీలో పైస్థాయి నేతలనే ప్రసన్నం చేసుకోవడంతో దిగువ క్యాడర్‌ ప్రచారంలో పాల్గొనడం లేదని చెబుతున్నారు. యలమంచిలి టీడీపీ సీటును ప్రగడ నాగేశ్వరరావు ఆశించారు. కానీ పొత్తులో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్‌కు ఇచ్చారు. తొలుత తన వర్గంతో ఆందోళనకు దిగిన ఆయనకు భారీ ప్యాకేజీ అందడంతో కొద్దిరోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారని, ఆయన అనుచరులు మాత్రం దూరంగా ఉంటున్నారని అంటున్నారు.

ఇక పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి అనితను అక్కడ జనసేన నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల అనకాపల్లి లోక్‌సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ రంగంలోకి దిగి సర్దుబాటు చేసినా కింది స్థాయి క్యాడర్‌ టీడీపీ అభ్యర్థి ప్రచారంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అరకు సీటును తొలుత టీడీపీలో దొన్నుదొరకు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీకి మార్చారు. దీనిపై టీడీపీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పెద్దలకు సర్దుబాటుతో ఇప్పుడు కొంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారు.

Advertisement
Advertisement