
ఇంటింటికీ పింఛన్‌ను అడ్డుకుని.. ఇప్పుడు మొసలి కన్నీరా బాబూ?
ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఈసీని, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తావా?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల
సాక్షి, అమరావతి: వృద్ధులకు పింఛన్ల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త డ్రామా ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా 1వ తేదీనే సూర్యోదయానికి ముందే ఇంటింటికీ పింఛన్ తీసుకెళ్లే వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని వృద్ధులను మండుటెండలో నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.
సీఎం జగన్ తీసుకొచి్చన సచివాలయ వ్యవస్థలోని 1.30 లక్షల మంది ఉద్యోగులతోనే పింఛన్లను ఇంటింటికీ పంపాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. పింఛన్లు పేదల ఇంటికి వెళ్లకుండా ఆపించిన చంద్రబాబే.. ప్రభుత్వం ఏం చేయాలో ఎలా చెబుతారని నిలదీశారు. ఈసీ ఆదేశాలతో వీలైనంత త్వరగా పింఛన్ పంపిణీ చేసేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సజ్జల సోమవారం తాడేపల్లిలోకి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘అహంకారంతో, ఎల్లో మీడియా అండతో చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను సైతం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు కూడా అప్పటి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని నేరుగానే బాబు బెదిరించారు. వృద్ధుల కష్టాలను దగ్గరుండి చూసిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ పింఛన్ పంపిణీని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. దీనిని చంద్రబాబు అడ్డుకొన్నారు. దీంతో డీబీటీ ద్వారా పంపిణీ చేయాలని ఈసీ మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానికి కూడా బాబు ఒప్పుకోలేదు. చంద్రబాబు గ్యాంగ్, ఢిల్లీలో ఏజెంట్లతో ఈసీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏప్రిల్ 26న ఈసీ మరో లేఖ రాసింది. ఇందులో కూడా డీబీటీ ద్వారా ఇవ్వాలని చెప్పింది.
ప్రభుత్వ యంత్రాంగం డీబీటీ ద్వారా, ఇళ్ల వద్ద పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు మళ్లీ బ్యాంకుల ద్వారా కాదు, ఇంటికే వెళ్లి ఇవ్వాలంటూ ఈసీకి బాబు హుకుం జారీ చేయడం సిగ్గుచేటు. పింఛన్ కోసం ప్రజలు మళ్లీ రోడ్డెక్కాల్సి రావడానికి బాబే కారణం. ఈ పాపానికి బాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి బాధ్యులు. 32 మంది వృద్ధులను పొట్టన పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నదీ చంద్రబాబే’ అని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
ఒకట్రెండు నెలలు అడ్డుకుంటే అభిమానం తగ్గిపోతుందా?
బాబు పాలనలో పింఛన్ కోసం వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. వచ్చే కొద్దిపాటి పింఛన్ ఎప్పుడు, ఎంత మందికి వస్తుందో తెలీదు. అలాంటి చంద్రబాబు.. పింఛన్లను ఇంటి వద్దే అందిస్తున్న సీఎం జగన్‌ను ప్రశి్నస్తున్నాడు. ఆయనే పంపిణీ చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు.
ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్న వలంటీర్లకు సమాజంలో దక్కిన గౌరవాన్ని చూసి బాబులో వణుకు పుట్టింది. స్వయంగా పింఛన్ పంపిణీని అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారనే భయంతో దొంగ ఎత్తులు వేశారు. బినామీలతో సుప్రీం కోర్టులో కేసులు, ఫిర్యాదులతో అడ్డుకున్నారు. సీఎం జగన్ ప్రజలకు భరోసా ఇచ్చే పథకాలు తెచ్చారు కాబట్టే వలంటీర్లకు ఆదరణ పెరిగింది.
చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడు?
చంద్రబాబు నిస్పృహలో తప్పులు చేసి,సీఎం జగన్‌ను తిట్టడాన్ని చూస్తే బాబు అసలు మనిషి జన్మ ఎలా ఎత్తాడా అనిపిస్తోంది. బాబులో ఆయన తల్లిదండ్రులే సిగ్గుపడే అవలక్షణాలున్నాయి. వాటిని సీఎం జగన్‌కు ఆపాదించడం దుర్మార్గం. ప్రజలకు మంచి చేసే దమ్ములేక సంధి ప్రేలాపనలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రిని చంపితే ఏమవుతుందని అనడమే ఇందుకు నిదర్శనం. తుని ఘటనలో కాపులపై కేసులు పెట్టింది చంద్రబాబే. రైలు ఎవరు తగలబెట్టారో పవన్ కళ్యాణ్ ఆయన అన్న చిరంజీవిని అడిగితే బాగుంటుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూమలు దోచేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో చంద్రబాబ ఐఎంజీ భారత్‌కు 800 ఎకరాలు దోచిపెట్టే ప్రయత్నం చేసినట్టు అందరూ చేస్తారనుకోవడం అవివేకం. చంద్రబాబు వల్లే చుక్కల భూముల గందరగోళం వచ్చింది. చాలా మంది రైతుల భూములు పోయాయి. సీఎం జగన్ వచి్చన తర్వాత 3 లక్షల చుక్కుల భూమలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కలి్పంచి, యాజమాన్య హక్కులు ఇచ్చారు. చంద్రబాబుది దోపిడీ చేసే చెయ్యి. సీఎం జగన్‌ది ఇచ్చే చెయ్యి. షర్మిలమ్మ తెలంగాణలో మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. 13వ తేదీ తర్వాత మళ్లీ కనబడరు.
బాబు సీఎంగా ఉండగా 2017 జూలై 1న చీరాల
సమీపంలోని ఈపురుపాలెంలో పింఛన్ కోసం వృద్ధులు క్యూలైన్లలో అవస్థలు పడుతున్న వీడియోను సజ్జల ప్రదర్శించారు. ఉదయం 6.30 గంటలకే పింఛన్ కోసం మహిళలు, వృద్ధులు క్యూలో బారులు తీరడం ఇందులో కనిపించింది. ‘సక్రమంగా ఉంటే చూస్తా.. లేకపోతే చూడను’ అంటూ లైన్లో ఉన్న వృద్ధులపై జన్మభూమి కమిటీ సభ్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 11 దాటినా పది మందికి కూడా పింఛన్ ఇవ్వలేదని వృద్ధులు వాపోతున్నారు. నిలువ నీడలేక, గుక్కెడు మంచి నీళ్లు లేక, సొమ్మసిల్లి పడిపోయిన ఎన్నో హృదయ విదారక ఘటనలకు వీడియో సాక్షిగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment