ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే..
2019 ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలు అమలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల ఆర్థిక సాధికారతకు నవరత్నాలతో బాటలు
2024 ఎన్నికల మేనిఫెస్టోలో మరో ఐదేళ్లూ నవరత్నాలను మరింతగా పెంచి కొనసాగిస్తామని హామీ
విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణల ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి భరోసా
కానీ, సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటూ చంద్రబాబు రోజుకో అడ్డగోలు హామీ.. 2014లో ఇచ్చిన 650 హామీల్లో ఒక్కటీ
అమలుచేయని టీడీపీ అధినేత
పైగా.. టీడీపీ వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టో మాయం
సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడని ప్రజల గట్టి నమ్మకం
అదే సమయంలో బాబు మోసం చేస్తాడన్నది జనం ప్రగాఢ విశ్వాసం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రభుత్వానికి లేదా పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది. ఇది రాజకీయ విశ్లేషకులో.. సర్వే సంస్థలో చెబుతున్న మాటకాదు. చరిత్ర చెబుతున్న వాస్తవం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసిన సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గొంతులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా గత ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాలను మరింతగా పెంచి వచ్చే ఐదేళ్లూ కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్ హామీ ఇచ్చారు.
విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలను కొనసాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని అందులో ఆయన స్పష్టంచేశారు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి 650కి పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఏ ఒక్క హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టిన చంద్రబాబు.. కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోయిన హామీలకే ‘సూపర్ సిక్స్’ అని ముసుగేసి.. తల్లికి వందనం పథకం కింద ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు.. ఐదుగురు.. ఇలా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఆ తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామంటూ రోజూ హామీల పాట పాడుతున్నారు.
చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో పది నెలలుగా ఆయన ఊదరగొడుతున్న ఈ హామీలను ఎవరూ పట్టించుకోవడంలేదు. అదే సమయంలో.. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో ఈ నమ్మకమే వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు 2009 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేస్తున్నారు.
వైఎస్ విశ్వసనీయతకే పెద్దపీట..
2004 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాట మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడం, వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీచేస్తూ సీఎంగా తొలి సంతకం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, అర్హులందరికీ ఇళ్లు వంటి ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు.. ఆరోగ్యశ్రీ వంటి ఇవ్వని హామీలను కూడా అమలుచేసి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు.
2009 ఎన్నికల్లో.. 2004 నాటి హామీల అమలును కొనసాగిస్తూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని.. ప్రతినెలా ఒకరికి నాలుగు కేజీల చొప్పున ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచి ఇస్తామంటూ కొత్తగా రెండే హామీలిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓడినా గెలిచినా తనదే బాధ్యత అంటూ ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా దిగారు.
వైఎస్‌కు ఉన్న ప్రజాబలం చూసి 2009 ఎన్నికల్లో చంద్రబాబు.. టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమిగా ఏర్పడి పోటీకి దిగారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ అడ్డగోలుగా హామీలిచ్చి పారేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో కుటుంబం ఖాతాలో ప్రతినెలా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ (డీబీటీ) కింద జమచేస్తామన్నారు. కానీ, 1995–2004 వరకూ బాబు మోసాలు, అరాచకాలను గుర్తుంచుకున్న ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికే పట్టంకట్టారు.
చరిత్ర పునరావృతం ఖాయం..
విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన చంద్రబాబు.. రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగభృతిగా రూ.2 వేలు ఇస్తానంటూ 650కి పైగా హామీలను ఎడాపెడా గుప్పించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టోను మాయంచేశారు. అందులోని ఒక్కదాన్నీ అమలుచేయకుండా వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టారు.
ఆ ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలను అమలుచేశారు. నవరత్నాలు పథకాలు కింద డీబీటీ రూపంలో 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గింది. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలైన విద్యాకానుక, గోరుముద్ద, వసతిదీవెన వంటి హామీలను అమలుచేసిన సీఎం జగన్ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు.
ఈ నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించేందుకు వచ్చే ఐదేళ్లూ నవరత్నాల పథకాలను విస్తరించి, కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అమ్మఒడిని రూ.15 వేలను రూ.17 వేలకు.. రైతుభరోసాను రూ.13,500లను రూ.16 వేలకు.. పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.3,500లకు పెంచుతామని హామీనిస్తూ మళ్లీ రెండే పేజీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనేందుకు భయపడిన చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో మళ్లీ జట్టుకట్టి సూపర్ సిక్స్ అంటూ మేనిఫెస్టో పాట పాడుతున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు పేర్కొన్న హామీలన్నీ కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడాన్ని ప్రజలు తెలుసుకున్నారు. దీంతో అడ్డగోలు హామీలిచ్చేస్తున్నారు. అయినా.. వివేకవంతులైన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మాటపై నిలబడే సీఎం వైఎస్ జగన్‌కే మరోసారి పట్టం కట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. 2009 నాటి చరిత్ర పునరావృతం కావడం ఖాయమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment