AP Assmebly Elections 2024: CM YS Jagan Speech Highlights At Bobbili Road Show, Details Inside | Sakshi
Sakshi News home page

CM Jagan Bobbili Road Show: ‘జగన్‌ను ఈ ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్‌షోలో సీఎం జగన్‌

Published Wed, May 1 2024 1:05 PM

AP Elections 2024:  CM YS Jagan Speech At Bobbili Road Show

విజయనగరం, సాక్షి: కుర్చీలు లాక్కోవడం, వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం, మనషుల్ని చంపేయడం.. ఇదే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం ఉదయం బొబ్బిలి మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగించారు.

ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు. మళ్లీ మోసపోవడం ఖాయం.  ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు.. ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి.  రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలు..

..చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించాం. ప్రతీ పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించాం. రైతన్నకు చేయిపట్టుకుని సాయం అందించాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరగని సామాజిక న్యాయం కళ్లెదుటే కనిపిస్తోంది. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.  డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం.  2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం.

.. ఎన్టీఆర్‌ కుర్చీని లాక్కుని, సొంత పార్టీ అధ్యక్షుడ్ని కుట్రలతో చంపేసిన వ్యక్తి. వంగవీటి మోహన రంగాను కుట్రలతో చంపింది ఎవరు?. ఐఎస్‌ అధికారి రాఘవేంద్రను కుట్రలతో చంపించింది ఎవరు?. ఇప్పడు మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేనని చంద్రబాబుకి అర్థం అయ్యింది. మోసపూరిత హామీలతో.. ఎన్నెన్ని మాటలు చెబుతున్నా ప్రజలెవరూ చంద్రబాబును నమ్మడం లేరు. జనం మోసపోవడానికి సిద్ధం లేరని చంద్రబాబుకి అర్థం అయ్యింది. ఈ జగన్‌ను చంపేస్తే ఏమౌతుంది అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సిగ్గుచేటు పరిణామం.

చంద్రబాబు మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి. అయ్యా చంద్రబాబూ.. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌, ఆ మహానేతకు వచ్చిన ప్రజాదరణను ఓర్వలేక అసెంబ్లీ సాక్షిగా ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్’‌ అని అన్నమాటల్నినేను మరిచిపోలేను. నాడు నా తండ్రిని, నేడు నన్నూ.. ఈ ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనలేక నువ్వు మాట్లాడే మాటలు.. నీ నేర ప్రవృత్తికి  అద్దం పడుతున్నాయి. బాబు మెంటల్‌ హెల్త్‌ ఏ స్థాయిలో ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.

కానీ, చంద్రబాబు అనుకుంటే జగన్‌ చనిపోడు.. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు. అవ్వాతాలు, అక్కాచెల్లెమ్మల ప్రార్థనలు, దీవెనలే నాకు శ్రీరామరక్ష.

.. ఎన్నికలయ్యాక చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. కానీ, మీ బిడ్డ ఈ జగన్‌ 58 నెలల పాలనలో 99 శాతం హామీలు అమలు చేశాడు. అయ్యా.. నువ్వు 14 ఏళ్లు సీఎంగా చేశావ్‌. మరి నీ పేరు చెబితే ఒక్క పేదవాడికి మంచి చేసినట్లు గుర్తుకు వస్తుందా?. 2014లో మేనిఫెస్టోతో చంద్రబాబు చేసిన మోసం గుర్తుందా?. ప్రధాన హామీల పేరుతో ఏ ఒక్క వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి, అదే మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.

వలంటీర్ల ద్వారా మళ్లీ సంక్షేమం కొనసాగాలన్నా, వైద్యం ఆరోగ్య సేవలు.. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలన్నా.. ఫ్యాన్‌ గుర్తును రెండుసార్లు నొక్కాలి. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకే రావాలి. దేశంలో ఎన్నడూ జరగని విధంగా, రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు.. మొత్తం రెండొందల స్థానాలకు ఏకంగా 100 స్థానాలు.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు పోటీకి దిగుతున్నారు. సామాజిక న్యాయం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోండి.

వైఎస్సార్‌సీపీ తరఫున బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌. వెంకట చిన అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించి సామాజిక న్యాయాన్ని గెలిపించాలి. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌లను గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Advertisement
Advertisement