ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర

Published Thu, May 2 2024 5:54 AM

A conspiracy to alienate employees and pensioners from the government

వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడం అవాస్తవం

వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి

మంత్రివర్గ ఉప సంఘం, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు

‘అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌’కు సానుకూలం 

12వ పే రివిజన్‌ కమిషన్‌ నియామకం 

ప్రభుత్వ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి  

కడప కార్పొరేషన్‌: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్‌ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. 

ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్‌ లీవులు, టీఏ, ఏపీజీఎల్‌ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్‌ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు.  

10,177 మంది రెగ్యులరైజ్‌ 
రాష్ట్ర బడ్జెట్‌ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్‌ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్‌ బకాయిలను క్లియర్‌ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్‌సీ అరియెర్స్‌ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటినీ క్లియర్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్‌ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. 

ఐఆర్‌ 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని, అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్ష¯Œన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్‌ చేశారని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్‌పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్‌.. 12వ పే రివిజన్‌ కమిషన్‌ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

 మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్‌లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్‌ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్‌ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. 

పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవ్‌ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు.  

వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 
2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్‌డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్‌ బుక్‌లో నోట్‌ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు.   

Advertisement
Advertisement