ఎవరి ధీమా వారిదే.. | Sakshi
Sakshi News home page

ఎవరి ధీమా వారిదే..

Published Tue, May 14 2024 3:15 PM

ఎవరి ధీమా వారిదే..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల్లో గెలుపుపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగిన ఓటింగ్‌ సరళిని బట్టి చూస్తే చేవెళ్ల లోక్‌సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ కన్పిస్తోంది. నేనే గెలవబోతున్నానని ఒకరు అంటే..కాదు నేనే గెలుస్తానంటూ మరొకరు దీమాగా ఉన్నారు. మైనార్టీల, మహిళల ఓట్లు గంపగుత్తగా తమకే పడ్డాయని.. ఈ ఓట్లు తమను గట్టెక్కిస్తాయని కాంగ్రెస్‌ చెబుతుండగా, ఐటీ ఉద్యోగులు, యువత, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు, పట్టణ ఓటర్లు కమలం వైపు మొగ్గుచూపినట్లు ఆ పార్టీ చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఓటుబ్యాంకు కూడా బీజేపీ వైపు మళ్లిందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత అంశం సహా ఆరు గ్యారంటీల హామీ, సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు కాంగ్రెస్‌కు కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. దీనికితోడు చివరి నిమిషంలో నిర్వహించిన పోల్‌మేనేజ్‌మెంట్‌ కూడా ఇందుకు దోహదం చేస్తుందని వారు దీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే గత రెండు ఎన్నికల్లోనూ హవా కొనసాగించిన బీఆర్‌ఎస్‌ ఆఖరి నిమిషంలో చేతులెత్తేసింది. బీసీ కార్డు ఆశించిన స్థాయిలో పనిచేయకపోగా, మెజార్టీ మండలాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు కూడా బీజేపీకి డైవర్ట్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని షాద్‌నగర్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. షాద్‌నగర్‌ పట్టణం సహా గ్రామీణ ప్రాంతాలు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన క్యామ మల్లేశ్‌ జిల్లా వాసి అయినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయన కూడా చేతులెత్తేసినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ కేడర్‌లో చీలిక వచ్చి.. కొంతమంది కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా, మరికొంత మంది బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఎల్బీనగర్‌లోని మెజార్టీ ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఈటల రాజేందర్‌ గెలుపు దాదాపు ఖాయమేనని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని కల్వకుర్తిలోనూ కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ నెల కొంది. ఇక్కడ ఎవరికి వారు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ!

చివరి నిమిషంలో చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌

బూత్‌ల వారీగా ఓటింగ్‌ సరళిపై ఆరా..

Advertisement
 
Advertisement
 
Advertisement