రామోజీ.. మీ రాతల్లోనే వ్యత్యాసం  | Sakshi
Sakshi News home page

రామోజీ.. మీ రాతల్లోనే వ్యత్యాసం 

Published Sat, Apr 20 2024 5:21 AM

Loans at 7 percent interest in all districts - Sakshi

పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసింది బాబు కాదా? 

ఆ రుణాల మొత్తాన్ని చెల్లించింది సీఎం జగన్‌ కాదా? 

బాబు చేసిన తప్పిదాన్ని సీఎం జగన్‌ సరిచేశారు

ఆ తర్వాతే వారికి బ్యాంకర్లు విరివిగా రుణాలిస్తున్నారు 

అన్ని జిల్లాల్లో 7 శాతం వడ్డీకే రుణాలు.. ఈ వడ్డీ భారాన్ని భరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమే  

సాక్షి, అమరావతి : రామోజీ మెదడు మోకాల్లోకి వచ్చిందేమోనన్న సందేహాలను ఈనాడు ప్రచురించే కథనాలు బలపరుస్తున్నాయి. పొదుపు సంఘాల రుణాలకు కొన్ని జిల్లాల్లో ఒక విధంగా.. మరికొన్ని జిల్లాల్లో మరో విధంగా వ్యత్యాసపు వడ్డీ రేటును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అజ్ఞానపు రాతలతో సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం ‘అన్నా...సున్నా అంటే అంత భారమా?’ శీర్షికన ఒక తెలివితక్కువ కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈనాడు అజ్ఞానాన్ని చూసి బ్యాంకులు, పొదుపు సంఘాల మహిళలు నవ్విపోతారన్న స్పృహ అయినా రామోజీకి లేకుండా పోయింది.

బాబు 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే బేషరతుగా పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఘోరమైన అబద్ధమాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా తన హయాంలో  సున్నా వడ్డీ పథకాన్ని ఆపేస్తే.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు పెట్టిన బకాయిలన్నిటినీ బ్యాంకులకు చెల్లించి, ఆ పథకాన్ని పునరుద్ధరించారు.

బాబు చేసిన మోసానికి పొదుపు సంఘాలు నీరుకారిపోయాయి. సున్నా వడ్డీ రుణాలు అందక అల్లాడిపోయాయి. బాబు చేసిన ఈ ఘోరమైన తప్పును జగన్‌ సరిదిద్దడంతో బ్యాంకులు ఇప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఈ నిజాలు రామోజీ మట్టిబుర్రకు తెలియక అజ్ఞానాన్ని రంగరించి, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో నాలుగు శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, మిగిలింది కేంద్రం ఇస్తోందని తన తెలివితక్కువ పాత్రికేయ అసమర్థతను బయటపెట్టుకుంది.

తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్న ఈనాడు...
‘ఆరు జిల్లాలకు ఏడు శాతం కేంద్రం రాయితీ’ అంటూ తమ కథనంలో ఓ ఉపశీర్షికను పెట్టి.. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద  కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోందని , అందులో ఏపీ పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నట్టు ‘ఈనాడు’ రాసుకుపోయింది. ఆ ఆరు జిల్లాల్లో  మాత్రమే  సంఘాలు రూ. 3 లక్షల వరకు తీసుకున్న రుణానికి  అక్కడ బ్యాంకులు 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తూ,  కేంద్రం ఏడు శాతం రాయితీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు శాతమే భరిస్తోందంటూ ఈనాడు రాసింది.  

వాస్తవం ఏమిటంటే..2022 జూలై 20న ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకే పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై కేంద్రం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నదే శుద్ద తప్పు. ఆ ఏడు శాతం వడ్డీ మొత్తాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది. ఈనాడు మరో పెద్ద శుద్ధ తప్పు రాసింది.  రాష్ట్రంలో ఇప్పుడు ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఒకలా, మరో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకోలా వడ్డీ రేటుకు పొదుపు  సంఘాలకు రుణాలిస్తోందని రాసింది. అలాంటి వ్యత్యాసం లేనేలేదు.

ఇప్పుడు.. బ్యాంకులే మహిళలను బతిమిలాడి రుణాలిచ్చే స్థితి..
అప్పట్లో చంద్రబాబు డ్వాక్రా రుణామాఫీ హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయని కారణంగా రాష్ట్రంలో మొత్తం పొదుపు సంఘాల్లో 18.6 శాతం సంఘాలు అంటే ప్రతి ఐదులో ఒక సంఘం బాబు మాట నమ్మి తమ రుణాలు చెల్లించకపోవడంతో వాళ్లందరూ బ్యాంకుల ఎగవేతదారులుగా ముద్ర వేయించుకున్నారు.  ఇప్పుడు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పు మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లించడం వంటి కారణాలతో ఇప్పుడు మహిళలు 99.83 శాతం మంది అంటే దాదాపు అందరూ ఎప్పటికప్పుడు తమ కిస్తీలను చెల్లిస్తున్నారు.

ఈ చెల్లింపులతో బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలపై నమ్మకాన్ని పెంచుకున్నాయి.  ఇప్పుడు  ఎంత కావాలంటే అంత రుణాలు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.  2019 ఏప్రిల్‌ నుంచి 2024  ఫిబ్రవరి వరకు ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.73 లక్షల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలుగా ఇచ్చాయంటే రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల వద్ద ఎంత పరపతి పెరిగిందో అర్ధమవుతుంది.

బాబు  ప్రభుత్వంలో కేవలం ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ. 10 లక్షల చొప్పున మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వగా,  ఇటీవల ఆర్‌బీఐ  పొదుపు సంఘాలకు గరిష్ఠంగా  రూ. 20  లక్షల వరకు పరిమితిని పెంచడంతో చాలా సంఘాలు ఇప్పుడు రూ. 20 లక్షల చొప్పున రుణాలు పొందుతున్నాయి. 

చంద్రబాబు చేసిన మోసం ఈ ప్రభుత్వానికి అంటగట్టే యత్నం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల రుణాలపై మొదట పావలా వడ్డీ పథకం అమలు చేయగా, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సున్నా వడ్డీ అమలులోకి వచ్చింది.  విభజన అనంతరం.. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్ల కాలంలో ఒక రూపాయినైనా మాఫీ చేయకుండా రాష్ట్రంలో పొదుపుసంఘాల మహిళలందరినీ మోసం చేసిన  చంద్రబాబు  ఉమ్మడి రాష్ట్రంలో  సున్నా వడ్డీ పథకానికీ మంగళం పాడేశారు.

2016 జూలై తర్వాత రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై  వడ్డీలో ఒక్క రూపాయి అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లించలేదు.  2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు గత ఐదేళ్లుగా ఏటా ఠంచన్‌గా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఆ ఏడాది వడ్డీ డబ్బును ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లిస్తూ వస్తోంది.   గత నాలుగేళ్లల్లో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ. 4969.05 కోట్లను ఇప్పటికే ఆయా మహిళలకు చెల్లించింది.

2023–24 సంవత్సర వడ్డీని ఇటీవల ముగిసిన మార్చి నెలాఖరు తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. వాస్తవం ఇది...దీనికి భిన్నంగా  చంద్రబాబును వెనకేసుకొచ్చే రాతలు రాసింది.  అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ఆపేసిన సున్నా వడ్డీని  గొప్పగా చిత్రీకరిస్తూ.. అవన్నీ బకాయిలుగా పేర్కొంది. అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించలేదని , ఇదంతా ‘జగన్‌ మోహన్‌రెడ్డి నయవంచన’ అంటూ ఈనాడు వక్రీకరించింది. వరుసగా రెండన్నరేళ్ల పాటు పథకానికి నిధులు ఇవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే  వాటిని బకాయిలు ఎలా అంటారని అధికారులు  ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
Advertisement