పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. యాపిల్‌కు ఈయూ వార్నింగ్‌! | Sakshi
Sakshi News home page

పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. యాపిల్‌కు ఈయూ వార్నింగ్‌!

Published Sat, Jan 27 2024 7:59 PM

EU warns Apple of strict consequences - Sakshi

ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, ఉపకరణాలు తయారుచేసే ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను యూరోపియన్‌ యూనియన్‌ హెచ్చరించింది. యాపిల్‌ యాప్‌స్టోర్‌లో చేస్తున్న మార్పులు యూరోపియన్‌ యూనియన్‌ తీసుకువచ్చే నిబంధనలకు అనుగుణంగా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది.

యూరోపియన్‌ యూనియన్‌ తీసుకువస్తున్న డిజిటల్ మార్కెట్ల చట్టానికి (DMA) అనుగుణంగా యాపిల్‌.. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు ప్రత్యామ్నాయ యాప్ స్టోర్‌ల ద్వారా యాపిల్‌ పరికరాలలో తమ అప్లికేషన్‌లను ఉంచడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్‌లలో యాప్‌స్టోర్‌ కాకుండా ప్రత్యామ్నాయ యాప్ స్టోర్‌లను అందించడానికి మార్చి ప్రారంభం నుంచి డెవలపర్‌లకు అవకాశం ఉంటుంది. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ప్రస్తుతం డెవలపర్‌లు 30 శాతం వరకు కమీషన్‌ చెల్లించాల్సి ఉంది.

ఈ సర్దుబాట్లు ఉన్నప్పటికీ యాపిల్‌ ఫీజు విధానం అన్యాయంగా ఉందని, ఇదిడిజిటల్ మార్కెట్ల చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. యాపిల్‌  ప్రణాళికల గురించిన విచారణలకు ప్రతిస్పందిస్తూ ఈయూ ఇండస్ట్రీ చీఫ్ థియరీ బ్రెటన్.. ‘డిజిటల్ మార్కెట్లు సజావుగా.. బహిరంగంగా పోటీకి ఇంటర్నెట్ గేట్లను డిజిటల్ మార్కెట్ల చట్టం తెరుస్తుంది. మార్పు ఇప్పటికే జరుగుతోంది. మార్చి 7 నుంచి థర్డ్‌ పార్టీల అభిప్రాయంతో కంపెనీల ప్రతిపాదనలను అంచనా వేస్తాం" అని రాయిటర్స్‌తో అన్నారు. కంపెనీల ప్రతిపాదిత పరిష్కారాలు చట్టానికి అనుగుణంగా లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి యూరోపియన్‌ యూనియన్‌ వెనుకాడదని బ్రెటన్ ఉద్ఘాటించారు.

యాపిల్‌ యాప్‌స్టోర్‌ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించకుండా డెవలపర్‌లకు ఎంపిక ఉన్నప్పటికీ ఒక యూజర్‌ అకౌంట్‌కు సంవత్సరానికి 50 యూరో సెంట్ల "కోర్ టెక్నాలజీ రుసుము" మాత్రం తప్పనిసరి. అయితే కొత్త వ్యాపార నిబంధనలను ఎంచుకున్న డెవలపర్‌లకు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుందని యాపిల్‌ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement