ఐపీఎల్-2024లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. రాజస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రావ్‌మెన్ పావెల్, అశ్విన్ ఉండగా.. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కమ్మిన్స్ భువీ అప్పగించాడు.
చివరి ఓవర్ తొలి బంతికి అశ్విన్ సింగిల్ తీసి పావెల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. పావెల్ రెండో బంతికి డబుల్, మూడో బంతిని బౌండరీగా మలిచాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రాజస్తాన్ విజయసమీకరణం 6 పరుగులుగా మారింది. ఆ తర్వాత వరుస రెండు బంతుల్లో పావెల్ రెండేసి పరుగులు తీయడంతో ఆఖరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 2 పరుగులు అవసరమయ్యాయి.
ఈ క్రమంలో భువనేశ్వర్ ఆఖరి డెలివరీని అద్బుతంగా బౌలింగ్ చేసి పావెల్‌ను ఎల్బీ రూపంలో ఔట్ చేశాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ సంచలన విజయం నమోదు చేసింది.
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) హాఫ్ సెంచరీలతో పోరాట పటిమ కనబరిచారు.
ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. నటరాజన్, కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఆంధ్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. 41 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్(58), క్లాసెన్(42 నాటౌట్) పరుగులతో సత్తాచాటారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment