ICICI Bank Loan Scam: CBI Files Chargesheet Against Chanda Kochhar And Venugopal Dhoot - Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ స్కాంలో కీలక పరిణామం: ఆ ముగ్గురికీ భారీ షాక్‌!

Published Sat, Apr 8 2023 5:06 PM

ICICI Scam CBI files Chargesheet against Chanda Kochhar Deepak and Venugopal Dhoot - Sakshi

సాక్షి,ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కాం కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌కు భారీ షాక్‌ తగిలింది. ఈ  కుంభకోణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చందా కొచ్చర్‌ తోపాటు, ఆమె భర్త, దీపక్ కొచ్చర్, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌లపై చార్జిషీట్ దాఖలైంది. ముంబై సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో సీబీఐ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు సీబీఐ అధికారులు శనివారం తెలిపారు.

ఐసీఐసీఐ బ్యాంక్ 2009 ,  2011 మధ్య వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన ఆరు కంపెనీలకు రూ. 1,875 కోట్ల రూపాయల టర్మ్ రుణాన్ని మంజూరులో అవకతవకలు జరిగాయని  సీబీఐ ప్రధాన ఆరోపణ.  క్విడ్‌ ప్రో కింద వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలు మంజూరైనట్టు, ఇందులో ధూత్ అంతిమ లబ్ధిదారుడని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకుగాను దీపక్ కొచర్‌కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్‌కు రూ. 64 కోట్లు, దక్షిణ ముంబైలోని ఫ్లాట్‌కు 2016లో రూ. 11 లక్షలు (విలువ రూ. 5.25 కోట్లు) లంచంగా ముట్టాయని  సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో  చందాకొచ్చర్‌ను ఐసీఐసీఐ బ్యాంకు  తొలగించింది. 

ఈ కేసులో సీబీఐ 2019లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2019లో, చందా కొచ్చర్ బ్యాంక్ ఎండీగా ఉన్నప్పుడు కంపెనీలకు ఐసీఐసీఐ మంజూరు చేసిన రూ.1,800 కోట్లకు పైగా రుణానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 2022 డిసెంబర్‌లో కొచ్చర్‌ దంపతులను, వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. అయితే, అరెస్టులు చట్టానికి లోబడి లేవని పేర్కొంటూ జనవరి 9న బాంబే హైకోర్టు కొచ్చర్‌లకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ధూత్‌కు బెయిల్ కూడా లభించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement