మణిపుర్‌లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్‌లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.
కాంగ్‌పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.
బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.
గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.
ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment