ఊసరవెల్లి సిగ్గుపడుతోంది! | Velagapalli Varaprasad Fire On Party Ledaers | Sakshi
Sakshi News home page

ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!

Published Wed, May 1 2024 8:08 AM | Last Updated on Wed, May 1 2024 8:17 AM

Velagapalli Varaprasad Fire On Party Ledaers

    విలువలకు తిలోదకాలు.. పార్టీలు మార్చడం వారి నైజం 

    జనంలో గుర్తింపే లేని వారిని ఎంపీ, ఎమ్మెల్యే చేసిన వైఎస్సార్‌సీపీ 

    తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి పచ్చ కండువా కప్పుకున్న వైనం 

    జంపింగ్‌ జపాంగ్‌లు వరప్రసాద్, ఆదిమూలం, ఆరణిని దరించుకుంటున్న జనం 

    వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా!

వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా        కమామిషు ఏంటో మీరే చదవండి..!  

సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్‌ జపాంగ్‌లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. 
   
దోపిడీకి ఆయనే ‘మూలం’ 
సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్‌ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు  చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్‌సీపీ టికెట్‌ నిరాకరించింది.  

ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం 
తిరుపతి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి వరప్రసాద్‌ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్‌ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్‌ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. 

అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్‌సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్‌ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్‌ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలువే.

రౌడీయిజం..ఆరణి నైజం 
తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్‌..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్‌లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్‌ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement