ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
జూలై 24కు విచారణ వాయిదా
వివరాలు అందించడానికి సమయం కావాలన్న తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది
ఇప్పటికే పలుసార్లు వాయిదా కోరారు
ప్రతిసారి వాయిదా వేయడం సరికాదు
ఎమ్మెల్యే ఆళ్ల తరఫు న్యాయవాదులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో విచారణను వాయిదా వేయాలని మరోసారి కోరొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని.. విచారణను సీబీఐకు అప్పగించాలంటూ మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను గురువారం న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా తొలిసారి కేసు విచారణకు హాజరవుతున్నానని.. మరికొన్ని వివరాలు అందజేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి న్యాయస్థానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో విచారణను మరో రెండు వారాలు వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు ఆర్.బసంత్, రమేశ్ అల్లంకి అభ్యంతరం తెలిపారు. చిన్న చిన్న అంశాలు సాకుగా చూపి ఇప్పటికే పలుసార్లు వాయిదా కోరారన్నారు. ఇదే ధర్మాసనం ముందు కూడా వాయిదా పొందారని గుర్తుచేశారు.
పిటిషనర్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగానే వచ్చిందని, ఇంకా అదనంగా వివరాలు అందజేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతిసారి వాయిదా కోరడం సరికాదన్నారు. అనంతరం రెండు వారాలు వాయిదా వేస్తామని ధర్మాసనం చెప్పగా స్పష్టమైన తేదీని ప్రకటించాలని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు.
ఈ సమయంలో చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకొని వేసవి సెలవుల అనంతరం కేసును విచారించాలని అభ్యర్థించారు. జూలైకు వాయిదా వేయడం అసలు సరికాదని మరోసారి ఆళ్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను జూలై 24న చేపడతామని ధర్మాసనం వాయిదా వేసింది.
చంద్రబాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విచారణను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతోందన్నారు. ఓటుకు కోట్లు కేసు విచారణ అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నాడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి రూ.5 కోట్లకు బేరం కుదుర్చుకొని రూ.50 లక్షలు బయానాగా ఇచ్చిన విషయాన్ని దేశ ప్రజలందరూ స్పష్టంగా చూశారన్నారు.
సెక్షన్ 39 సీఆర్‌పీసీ ప్రకారం అనుకోని ఘటన, ప్రమాదం జరిగినప్పుడు ఏ పౌరుడైనా పోలీసుస్టేషన్, మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లొచ్చని.. దీని ఆధారంగానే తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించానని, తనకు అనుగుణంగా ఆదేశాలు వచ్చినా ఇప్పటివరకు అనేక సాకులతో చంద్రబాబు న్యాయవాదులు కేసును సాగదీస్తూ వచ్చారని ఆరోపించారు.
ఈసారి తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాయిదా కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ న్యాయవాదులకు బాబు న్యాయవాదులు వత్తాసు పలకడం చూస్తుంటే చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుమ్మక్కైనట్టు తెలుస్తోందన్నారు. జూలై 24 నుంచి వాదనలు ప్రారంభమవుతాయని, వారిద్దరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment