రూపాయిలో వాణిజ్యానికి పలు దేశాల ఆసక్తి | Sakshi
Sakshi News home page

రూపాయిలో వాణిజ్యానికి పలు దేశాల ఆసక్తి

Published Tue, Mar 12 2024 6:01 AM

Many Countries Want To Trade In Rupees says Piyush Goyal - Sakshi

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: పలు వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలు భారత్‌తో రూపాయి మారకంలో వాణిజ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ విధానంలో లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశాలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు పలు గల్ఫ్‌ దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘ఈ విధానాన్ని సత్వరం ప్రారంభించేలా బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే మనతో చర్చలు జరుపుతున్నాయి.

పలు గల్ఫ్‌ దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలిసే కొద్దీ మరిన్ని దేశాలు కూడా ఇందులో చేరొచ్చు. సింగపూర్‌ ఇప్పటికే కొంత మేర లావాదేవీలు జరుపుతోంది‘ అని మంత్రి వివరించారు. ఈ పరిణామం భారత అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ ఇప్పటికే నేపాల్, భూటాన్‌ వంటి పొరుగు దేశాలతో రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తోంది. యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్‌కి తొలిసారిగా రూపాయల్లో చెల్లింపులు జరిపింది. 

Advertisement
Advertisement