వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం

Published Fri, Apr 19 2024 5:17 AM

TDP mobs attempt to kill YSRCP workers - Sakshi

 కళ్యాణదుర్గంలో దారుణం

మూకుమ్మడి దాడికి దిగిన  టీడీపీ అభ్యర్థి అమిలినేని బంధువులు, బౌన్సర్లు   

ప్రచార రథం తాళాలు లాక్కుని కవ్వింపు  

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కాలువలో పడేసి పిడిగుద్దులు 

గుండెలపై రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపే ప్రయత్నం 

గాయపడిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్‌  

విధుల్లో ఉన్న పట్టణ  సీఐ హరినాథ్‌పైనా చిందులేసిన టీడీపీ నేతలు

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశాయి. రెచ్చిపోయిన పచ్చమూకల దాడిలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్‌ ఉన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో గురువారం రోడ్‌షోకి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కాన్వాయ్‌కి ముందున్న ప్రచార వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని తాళాలు లాక్కున్నారు. తాళాలివ్వాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోరినా ససేమిరా అన్నారు.

‘తాళాలిచ్చేది లేదు. ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి..’ అంటూ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అల్లుడు అవినాష్, వ్యాపార భాగస్వామి రాజగోపాల్‌ ఆ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పారు. దీంతో రెండుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత మొదలైంది. ప్రచారరథం తాళాలివ్వాలని కోరిన కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డు మాజీ చైర్‌పర్సన్‌ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మంజునాథ్, అనిల్‌కుమార్‌లపై అవినాష్, రాజగోపాల్‌ దాడికి దిగారు. వీరితోపాటు అమిలినేని ప్రైవేట్‌ బౌన్సర్లు సుమారు 20 మంది మూకుమ్మడిగా దాడిచేశారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దుతూ, ఎదపై కాళ్లతో తన్నుతూ, రాళ్లతో కొడుతూ మురుగు కాలువలోకి పడేశారు. పదేపదే గుండెలపై దాడిచేసి చంపేసేందుకు ప్రయత్నించా­రు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వ్యక్తి­గత వాహ­న డ్రైవ­ర్‌ శివపైనా దాడి చేశారు. అతడి గొంతు నులిమారు. వా­రి దాడిలో శివ చేతికి గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక వాల్మీకి వర్గానికి చెందిన మహిళలను అమిలినేని వర్గీయులు, కుటుంబసభ్యులు నానా దుర్భాషలాడారు.

గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడికెళ్లిన కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్‌పైనా టీడీపీ నాయకులు చిందులు వేశారు. ముఖ్యంగా బ్రహ్మసముద్రం మండల టీడీపీ కన్వినర్‌ పాలబండ్ల శ్రీరాములు నానా దుర్భాషలాడారు. సీఐని ఏకవచనంతో మాట్లాడుతూ దౌర్జన్యానికి దిగారు.

విషమంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పరిస్థితి 
టీడీపీ మూకల దాడిలో గాయపడిన బిక్కి హరి, మంజునాథ్, అనిల్‌కుమార్‌లను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వా­రి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గురువారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. టీడీపీ మూకలు పిడిగుద్దులు, రాళ్లతో ఎదపై దాడిచేయడంతో వారు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారి కుటుంబసభ్యులు  తెలిపారు. చికిత్స పొందు­తున్న కార్యకర్తలను పలువురు నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు.

కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య చెప్పారు. శాంతికాముకులైన వాల్మీకులపై దాడిచేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాల్మీకి కులానికి చెందిన వ్యక్తిననే చిన్నచూపుతోనే తనను బూతు­లు తిడుతూ, కులం పేరుతో దూషి­స్తూ దాడిచేశారని బిక్కి హరి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి టీడీపీ నుంచి ప్రాణహాని ఉందని, తమకేదైనా జరిగితే టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుదే బాధ్యత అని బిక్కి నాగలక్ష్మి చెప్పారు.

రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు నమోదు  
ఈ విషయమై రెండుపక్షాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణకు సంబంధించి రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు  నమో­దు చేస్తామని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎర్ర­నేల వీధిలో ఎన్నికల ప్రచారం చేయడం, అదే ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఇల్లు, పార్టీ  కార్యాలయం ఉన్నట్లు తెలిపారు.

ముందస్తుగా ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నా­రు. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడటంతో తోపులాట జరిగిందని తెలిపారు. వివాదం తీవ్రం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement