ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు | Dont Do That In Team Game: Irfan Pathan Slams Dhoni Act Against PBKS | Sakshi
Sakshi News home page

ధోని ఇలా చేయడం సరికాదు: ఇర్ఫాన్‌ పఠాన్‌ ఘాటు విమర్శలు

Published Thu, May 2 2024 2:17 PM | Last Updated on Thu, May 2 2024 5:23 PM

Dont Do That In Team Game: Irfan Pathan Slams Dhoni Act Against PBKS

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.

ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ మరో ఎండ్‌ నుంచి సహకారం అందించాడు.

అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపి
అయితే, చివరి ఓవర్‌ మూడో బంతికి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ధోని షాట్‌ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్‌ మిచెల్‌ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.

కానీ సింగిల్‌ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్‌ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఆ తర్వాతి బంతికి సిక్స్‌ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఘాటుగా స్పందించాడు.

ధోని అలా చేయడం సరికాదు
‘‘ఎంఎస్‌ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్‌ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్‌ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.

ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్‌ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్‌ మిచెల్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ధోని చర్యను తప్పుబట్టాడు.‌

చదవండి: గిల్‌ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement