Kethu Viswanatha Reddy: నాయనా అని సంభోదిస్తూ మాటాడేవారు! | Sakshi
Sakshi News home page

Kethu Viswanatha Reddy: నాయనా అని సంభోదిస్తూ మాటాడేవారు!

Published Mon, May 22 2023 12:08 PM

Artist Anwar Tribute To Kethu Viswanatha Reddy - Sakshi

నాకు ఇష్టమైన కథకులలొ కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు.  నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ  ఉంది. నా అదృష్టాల్లో ఒకటి చిన్నతనాన నే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం. ఆ కథకు  నా బొమ్మ ఎంతబాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు  ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా . కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను నాయనా అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు.

మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన   కేతు విశ్వనాథరెడ్డి  పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకరించి పోతాను నేను. పెద్దలు ఇష్టులు మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు.  నాకు ప్రాంతీయాభిమానం ఉంది.

నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద  గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కోకు సమగ్ర  సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కోకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ  కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి   మహాద్భుతమైన పరిమళాన్ని  అందించారు కేతు గారు.

రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళి కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే  వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక  లోపలి రచనలు  ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి.

ఆ పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్  సత్యనారాయణ గారి బొమ్మ వేసి కోకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు.

కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర  నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు .  ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల  కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ  నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట  ఉండేది.

మోహన్ గారిలో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ  తెలియని ఎవరి మీదయినా సరే  మనలోకి తన వ్యక్తిగత  అభిప్రాయాన్ని  తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా,  అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని.

ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన  మోహన్ గారు చెప్పారు కదా,పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని  కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో!  ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం.  కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే.

ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని  తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా  ఉన్న కాలంలో  అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు.  కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. 

విశ్వనాథరెడ్డి  గారు తన ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్ గా తన  సేవలందించారు. పంజాగుట్ట లో ఉండేది ఆ అఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ  కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. 

అప్పటి సాహితీ  సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు  ఎప్పుడూ ఉండేవి కావు . అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక  ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా.

ఆ సందర్భానా  చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి  ముచ్చటైన  రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ  భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది.

"మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయితగా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు.

ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత,  ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు.

-అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దినపత్రిక
చదవండి: కేతు విశ్వ‌నాథ‌రెడ్డి కన్నుమూత.. సీఎం జగన్‌ సంతాపం

Advertisement
 
Advertisement
 
Advertisement