Sakshi News home page

US Court: ఆమెకు రూ.692 కోట్లు చెల్లించండి

Published Sun, Jan 28 2024 5:13 AM

Trump must pay E Jean Carroll 83. 3 million dollers in damages for defamation - Sakshi

న్యూయార్క్‌: పాత్రికేయురాలు, రచయిత్రి ఇ.జీన్‌ కరోల్‌కు పరువు నష్టం కలిగించినందుకు జరిమానాగా ఆమెకు దాదాపు రూ.692 కోట్లు(8.33 కోట్ల డాలర్లు) చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అమెరికా కోర్టు శనివారం ఆదేశించింది. 1996లో మాన్‌హాటన్‌లోని బెర్గ్‌డోర్ఫ్‌ గుడ్‌మ్యాన్‌ అవెన్యూ షాపింగ్‌మాల్‌ ట్రయల్‌రూమ్‌లో ట్రంప్‌ తనను రేప్‌ చేశారంటూ కరోల్‌ కేసు వేసింది. లైంగికదాడి జరిగిందని నిర్ధారించిన కోర్టు, ఆమెకు 41.56 కోట్లు చెల్లించాలంటూ 2023 మే లో ట్రంప్‌ను ఆదేశించింది.

తనపై లైంగికదాడి వివరాలను న్యూయార్క్‌ మేగజైన్‌ వ్యాసంలో, తర్వాత పుస్తకంలో కరోల్‌ పేర్కొన్నారు. రచనల అమ్మకాలు పెంచుకునేందుకు అసత్యాలు రాస్తున్నారంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇవి తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ ఆమె మరో దావా వేశారు. ఈ కేసు తుది తీర్పును మన్‌హాటన్‌ ఫెడరల్‌ కోర్టు శనివారం వెలువరించింది. కరోల్‌కు 1.83 కోట్ల డాలర్ల పరిహారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా మరో 6.5 కోట్ల డాలర్లు ఇవ్వాలని ట్రంప్‌ను ఆదేశించింది.

పై కోర్టుకు వెళతా: ట్రంప్‌
కోర్టు తీర్పు హాస్యాస్పదమని ట్రంప్‌ దుయ్యబట్టారు. ‘‘న్యాయ వ్యవస్థ చేయి దాటి పోయింది. ప్రభుత్వం దాన్నో ఆయుధంగా వాడుతోంది. పై కోర్టుకు వెళతా’ అని తీర్పు తర్వాత వ్యాఖ్యానించారు. గురువారం ఈ కేసు విచారణ మధ్యలోనే ట్రంప్‌ కోర్టులో నుంచి లేచి బయటికొచ్చారు. దీనిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్‌ లాయర్‌ వైఖరిని సైతం బాగా తప్పుబట్టారు. సరిగా ప్రవర్తించకుంటే మీరు జైలుకెళ్తారని లాయర్‌ను తీవ్రంగా మందలించారు కూడా.

Advertisement
Advertisement