నేడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో  | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో 

Published Sat, Apr 27 2024 2:17 AM

YSRCP manifesto today

విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో శనివారం విడుదల కానుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ప్రకటిస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ప్రస్తుతం రాష్ట్రంలో లక్షల కుటుంబాల స్థితిగతులను మార్చేసిన పథకాలన్నిటినీ తదుపరి టర్మ్‌లోనూ కొనసాగించాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించిందని, ఈ మేరకు మేనిఫెస్టోలో ప్రకటన చేసే అవకాశం ఉందని తెలియవచ్చింది. ప్రస్తుతం పిల్లలను స్కూళ్లకు పంపించడానికి ఏ తల్లిదండ్రులూ భయపడకుండా, ప్రయివేటు స్కూళ్లకు పంపినా కూడా వారి ఫీజులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం అమ్మ ఒడిని అందిస్తోంది. దీంతో పిల్లలను స్కూళ్లలో చేర్చి చదివించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇది అక్షరాస్యత రేటుతో పాటు విద్యావంతుల సంఖ్యనూ గణనీయంగా పెంచనుంది. అలాగే నాణ్యమైన విద్యను అందించడానికి స్కూళ్లను సకల సౌకర్యాలతో తీర్చి దిద్దటంతో పాటు వారికి స్కూళ్లు తెరిచే నాటికే యూనిఫాం, బూట్లతో పాటు పుస్తకాలన్నిటినీ కలిపి విద్యా కానుకగా అందిస్తున్నారు. ఇక 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్‌లిస్తూ... డిజిటల్‌ విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకాలన్నీ కొనసాగవచ్చని సమాచారం. 

నడివయసు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వడ్డీ లేని రుణాలను అందిస్తూ ‘చేయూత’ ఇస్తున్నారు. ఇక రైతాంగానికి ఏటా రెండు సార్లు రైతు భరోసాను అందిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ పథకాలతో పాటు మిగతా పథకాలనూ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం పథకాలన్నీ శాచ్యురేషన్‌ పద్ధతిలో... అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందేలా అమలు చేస్తున్నారు. 

ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న వర్గాలను ఒక స్థాయికి తెచ్చి, మిగిలిన వారితో వీళ్లు కూడా పోటీ పడేలా చేయాలన్నదే ఈ పథకాల అసలు ఉద్దేశం. అయితే ఉద్దేశించిన ఫలితాలు రావాలన్నా, ఇలా బలహీనంగా ఉన్న వర్గాలు ఆశించిన స్థాయికి చేరాలన్నా ఈ పథకాలను మరికొన్నాళ్లు కొనసాగించాల్సిన అవసరం ఉందని పార్టీ భావించిందని, ఈ నేపథ్యంలోనే ఆయా అంశాలన్నిటినీ పొందుపరిచి మేనిఫెస్టోను ప్రకటిస్తారని భావిస్తున్నారు.  

Advertisement
Advertisement