ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష

Published Tue, May 7 2024 4:20 AM

-

కొత్తగూడెంటౌన్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన మైసారపు వినయ్‌కుమార్‌(ఆర్మీ ఉద్యోగి)కు వరకట్న వేధింపుల కేసులో ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మూడో అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వాంకుడోతు శివనాయక్‌ సోమవారం తీర్పు చెప్పారు. పాల్వంచ బాంబే కాలనీకి చెందిన జ్యోతికి 2010 సెప్టెంబర్‌ 13న డోర్నకల్‌కు చెందిన మైసారపు వినయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.3.50 లక్షల కట్నం, రూ.50 వేలు ఇంటి సామగ్రి, మూడు తులాల బంగారం అందజేశారు. పెళ్లయ్యాక విజయవాడలోని కానూరులో రెండు నెలలు ఎలాంటి గొడవలు లేకుండా కాపురం సాగినా, జ్యోతి గర్భం దాల్చాక అదనపు కట్నం తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధించిన వినయ్‌, కత్తితో గాయపరిచాడు. ఇక ఏడో నెలలో పుట్టింటికి వచ్చిన జ్యోతికి కుమారుడు జన్మించాక చూడడానికి రాకపోగా, అదనపు కట్నం ఇవ్వకపోతే విడాకుల నోటీసు పంపిస్తానని ఫోన్‌లో బెదిరించాడు. ఆపై పెద్దమనుషులు సర్దిచెప్పడంతో తన భార్యను జమ్మూకశ్వీర్‌ తీసుకెళ్లిన వినయ్‌ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. అక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు కొడుతుండడంతో తిరిగి వచ్చేసిన జ్యోతి పాల్వంచ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం వినయ్‌కుమార్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ లావణ్య వాదించగా, సిబ్బంది హరిగోపాల్‌, పునెం బాబు సహకరించారు.

వరకట్న వేధింపుల కేసులో కోర్టు తీర్పు

Advertisement

తప్పక చదవండి

Advertisement